
సాక్షి, హైదరాబాద్: ‘రైతుల రుణమాఫీకి సంబంధించి వడ్డీ సమస్యలు పరిష్కరిస్తాం. పావలా వడ్డీకి అర్హులైన రైతుల నుంచి ఇంతకుముందు ఎక్కడైనా బ్యాంకులు వడ్డీని వసూ లు చెస్తే, ఆ వడ్డీని రైతులకు తిరిగి ఇప్పిస్తాం’అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో బుధవారం వ్యవసాయ, సహకార శాఖ పద్దులపై చర్చ అనంతరం ఆయన సమాధానమిచ్చారు.
రైతులకు ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి ఇవ్వడం దేశ చరిత్రలోనే మొదటిసారని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చే చెక్కులను రుణాలు తీసుకున్న బ్యాంకుల్లో వేస్తే డబ్బులు కట్ చేసుకుంటారనే అనుమానం ఉంటే.. వేరే ఏ బ్యాంకులోనైనా వేసుకొని డబ్బులు తీసుకోవచ్చని సూచించారు. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకం మంచిదే కానీ.. దాని అమలులో అనేక లోపాలున్నాయన్నారు. గ్రామం యూనిట్‌గా కాకుండా రైతును యూనిట్‌గా తీసుకోవాలని గతంలోనే శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, అది కేంద్ర పరిశీలనలోనే ఉందన్నారు.