
నితీష్‌తో ప్రశాంత్ కిషోర్ (ఫైల్ ఫోటో)
పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా ఆయన కీలక బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది..
పట్నా : ఎన్నికల వ్యూహాలు రచించడంలో దేశ రాజకీయాల్లో చాణిక్యుడిగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ (41) రాజకీయ ప్రవేశం చేయనున్నారు. బిహార్‌లోని ససారంకు చెందిన ప్రశాంత్ కిషోర్.. జేడీయూలో చేరనున్నారు. ఆ రాష్ట్రా సీఎం నితీష్ కుమార్ సమక్షంలో ఆదివారం ఆయన పార్టీలో చేరతారని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కంటే ముందే ఆయన పార్టీలో చేరుతారని జేడీయూ నేతలు ధృవీకరించారు. దీంతో పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా ఆయన కీలక బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
ఎన్నికల వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన కిషోర్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాకర్తగా పనిచేసి నరేంద్ర మోదీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత కాంగ్రెస్, జేడీయూ,ఆర్జేడీ తరుఫున బిహార్‌లో మహాకూటమి తరుపున పనిచేసి బీజేపీ ఓటమికి కారణమయ్యాడు. ఆ తరువాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సలహాదారుడిగా పనిచేసి అమరేందర్ సింగ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే నితీష్‌కు కిషోర్‌కు మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. దాంతోనే నితీష్ తన సలహాదారుడిగా కొంతకాలం ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకున్నాడు.
ఆ తరువాత బీజేపీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీల నుంచి ఆహ్వానాలు అందినా.. ఆయన వాటిని తిరస్కరించారు. తన సొంత రాష్ట్రామైన బిహార్‌కు చెందిన ప్రాంతీయ పార్టీతోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని భావించిన ఆయన.. ఈ మేరకు ‘‘బిహార్ నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని శనివారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. అంతకుముందు ఆయన ఐక్యరాజ్య సమితి పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా ఎనిమిదేళ్లు సేవలు అందించారు. ఆ తరువాత ఇండియన్ పోలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్)లో చేరి భారత్‌తో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
Excited to start my new journey from Bihar!
— Prashant Kishor (@PrashantKishor) September 16, 2018