సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా తనను నిలువరించాలన్న దురుద్దేశంతో పాత అక్రమ కేసులను తిరగదోడి అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్‌నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈడీ, ఇన్‌కంట్యాక్స్, సీబీఐలతో తనపై కక్ష సాధింపునకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రయత్నాలు చేయిస్తున్నారని, తనకు, తన కుటుంబానికి ఏం జరిగినా కేసీఆర్‌తోపాటు డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావులే బాధ్యత వహించాలని అన్నారు. సోమవారం ఇక్కడి గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటుకు నోటు అక్రమ కేసు ద్వారా తనను అణచివేయాలన్నది కేసీఆర్ ఆలోచన అని విమర్శించారు. నిజాం రాజుకు ఖాసీం రజ్వీ సహకరించినట్టు కేసీఆర్‌కు డీజీపీ మహేందర్‌రెడ్డి సహకరిస్తున్నారని, ఆయన డీజీపీగా కాకుండా కేసీఆర్ ప్రైవేటు సైన్యానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌లు అసెంబ్లీ రద్దుకు ముందు మోదీతో పలుమార్లు సమావేశమయ్యారని, కీలక శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కూడా కలసి తనను అరెస్టు చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
బీజేపీతో టీఆర్‌ఎస్ పొత్తు...
అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే ఎన్నికలు జరిగేలా సహకరించేందుకు మోదీ అభయమిచ్చారని, ఆ తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో బీజేపీ కలసి పోటీ చేయాలని రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తాజాగా కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజా తెలంగాణ కూటమిపై స్పష్టత రావడంతో తాను ప్రజాక్షేత్రంలోకి వెళ్తాననే ఆలోచనతోనే రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులను తిరగదోడేందుకు పథకం రచిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ టీమ్‌లో తాను కీలక పదవి చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తే టీఆర్‌ఎస్‌కు జరిగే నష్టాన్ని గ్రహించి కేసీఆర్ ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో గతంలో ఏ4గా ఉన్న మత్తయ్య కోర్టుకు వెళితే ఆ కేసును హైకోర్టు కొట్టివేసిందని, అయినా ఏదో ఒక సాకుతో తనను అరెస్టు చేయించేలా డీజీపీతో కలసి కేంద్రానికి లేఖ రాయించారని విమర్శించారు. వెంటనే ఈడీ, ఇన్‌కంట్యాక్స్ దాడులు చేయించేందుకు ప్రయత్నించారని, కానీ ఎందుకో కేంద్ర సంస్థలు వెనక్కి తగ్గాయని చెప్పారు.
బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇటీవలి రాష్ట్ర పర్యటనలో కేసీఆర్ నమ్మకస్తులు ఆయనను కలిశారని, రేవంత్‌ని ఇంకా అరెస్ట్ చేయలేదా.. అని అడిగారని, అమిత్ షా కూడా ఈ విషయంలో కేసీఆర్ మనుషులకు మాటిచ్చినట్టు తనకు సమాచారం ఉందని తెలిపారు. పదవి వచ్చే రెండురోజుల ముందే అరెస్ట్ చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ తనతోపాటు కాంగ్రెస్ నేతలందరినీ కమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ నేతలంతా సమష్టిగా ఈ కేసులను ఎదుర్కోవాలని, పార్టీ శ్రేణులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. కేసీఆర్‌ని ఒక్కసారి సీఎం చేస్తేనే ఇంత అణచివేతకు గురిచేస్తున్నారని, తిరిగి అధికారంలోకి రానిచ్చే ప్రసక్తి లేదన్నారు.
కేసీఆర్‌కు సహకరిస్తున్న అధికారుల లెక్క బరాబర్ చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ కక్ష సాధింపును వడ్డీతో సహా వసూలు చేస్తామని, ఆ అధికారులంతా భారీ మూల్యం చెల్లించక తప్పదని రేవంత్ హెచ్చరించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువుహత్య కేసులో టీఆర్‌ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పాత్ర ఉందని బాధితురాలే చెప్తోందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ కేసును సమగ్రంగా విచారణ చేయకుండా కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, పూర్తి వివరాలు సేకరించిన తర్వాత తాను ఈ విషయంపై మాట్లాడతానని వెల్లడించారు.
నన్ను అరెస్టు చేసేందుకు కేసీఆర్ కుట్ర
Published Tue, Sep 18 2018 3:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment