బెంగళూరు: కర్ణాటకలో మంత్రిత్వ శాఖల కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌తో భేదాభిప్రాయాలున్నాయని సీఎం కుమారస్వామి చెప్పారు. ఇవి ప్రభుత్వాన్ని పడగొట్టేంత పెద్దవేమీ కాదన్నారు. ఆత్మగౌరవాన్ని వదులుకుని సీఎం పీఠానికి అతుక్కుపోవాలనుకోవటం లేదన్నారు. ‘శాఖల కేటాయింపు జరగలేదు. ఈ విషయంలో కాంగ్రెస్‌తో సమస్యలున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అధిష్టానం నుంచి ఆమోదం లభించాక∙కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఏ సమస్యను ప్రతిష్టాత్మకంగా తీసుకోను. ప్రతిదాన్నీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. ఆత్మగౌరవాన్ని వదులుకుని సీఎం పీఠానికి అతుక్కుపోను’ అన్నారు.
కాంగ్రెస్‌తో చర్చించాకే రుణమాఫీ
‘దురుద్దేశపూర్వకంగానే యడ్యూరప్ప రాష్ట్రవ్యాప్త బంద్‌కు (సోమవారం) పిలుపునిచ్చారు. ఇచ్చిన మాటపై వెనక్కు తగ్గను. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతలతో చర్చించాను. వారి నిర్ణయాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని స్వామి తెలిపారు. కేంద్రంలో నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్న ఎన్డీయే ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తానన్నారు.
ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు
మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించేందుకు డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్య, సీనియర్ నేత డీకే శివకుమార్‌సహా పలువురు కర్ణాటక కాంగ్రెస్ నేతలు ప్రత్యేక విమానంలో శనివారం ఢిల్లీకి వెళ్లారు. ‘అన్ని చర్చలు ఢిల్లీలోనే జరుగుతాయి ఎవరికి ప్రాధాన్యతనివ్వాలి, ఎవరిని పరిగణనలోకి తీసుకోవాలి వంటి నిర్ణయాలను అధిష్టానమే తీసుకుంటుంది’ అని పరమేశ్వర తెలిపారు. అంతకుముందు వీరంతా బెంగళూరులోని ఓ హోటల్‌లో చర్చలు జరిపారు. కన్నడ ప్రభుత్వ పాలన కోసం కనీస ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన సమన్వయ కమిటీ ఏర్పాటుపైనా అధిష్టానంతో చర్చించనున్నారని సమాచారం.
కాంగ్రెస్ జాబితా ఖరారు
డీకే శివకుమార్ సహా 16 మందికి చోటు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటక ప్రభుత్వంలో కాంగ్రెస్ కోటాలో ఉన్న మంత్రిత్వ శాఖలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ జాబితాలో మాజీ మంత్రులు డీకే శివకుమార్, మాజీ హోం మంత్రి రామలింగారెడ్డి, ప్రియాంక్ ఖర్గేసహా 16 మంది పేర్లున్నాయి. ఢిల్లీలోని 12 తుగ్లక్ రోడ్‌లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌తో కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్య, సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేలు శనివారం సమావేశమై ఈ జాబితాను ఖరారు చేశారు. కీలక శాఖలను జేడీఎస్‌కు ఇవ్వద్దని కర్ణాటక కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. అటు, మే 28న (సోమవారం) జరగాల్సిన ఆర్‌ఆర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక విషయంలోనూ సంకీర్ణ పక్షాలు ఓ నిర్ణయానికి రాలేకపోయాయి.
కాంగ్రెస్‌తో పొత్తు అంతవరకే: దేవెగౌడ
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మాత్రమే కాంగ్రెస్‌తో పొత్తు కుదిరిందని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ స్పష్టం చేశారు. శనివారం రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తమ ప్రత్యర్థి అని దేవెగౌడ పేర్కొన్నారు. జేడీఎస్ అభ్యర్థి రామచంద్రప్ప బరి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదన్నారు. నకిలీ ఓటరు కార్డులు బయటపడడంతో ఈ నియోజకవర్గ ఎన్నిక ఈ నెల 28కి వాయిదా పడింది.
సమస్యలున్నాయి..!
Published Sun, May 27 2018 3:34 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment