
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సభ్యుల నినాదాలు.. పదే పదే సభలో అంతరాయం కలిగించటం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడుకు చికాకు తెప్పిస్తున్నాయి. ఒకనొక సమయంలో ఆయన ముఖంలోనే భావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ హోదాలో తొలి సమావేశాలను నిర్వహిస్తున్న ఆయన ఓ కార్యక్రమంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
‘‘ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఎలా జరుగుతున్నాయంటే.. మొదలవుతున్నాయ్.. వెంటనే ఆగిపోతున్నాయ్. ఇది దేశానికి అంత మంచిది కాదు. విలువైన సభా సమయం.. ప్రజా ధనం వృధా అవుతోంది. ప్రజలకు నేతలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది’’ అని ఢిల్లీలో ఓ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యాఖ్యానించారు. ఇక గతంలో ఇదే సభలో ఆయన సుదీర్ఘకాలం సభ్యుడిగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
పరిస్థితులు రాను రాను మరీ అద్వానంగా తయారవుతున్నాయని.. కీలకమైన బిల్లులపై చర్చించే పరిస్థితులు కనిపించటం లేదని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్థిక పురోగతి.. లక్ష్యాలు అన్న అంశంపై కూడా ఆయన ప్రసగించారు. కాగా, మన్మోహన్‌పై మోదీ వ్యాఖ్యలకు నిరసనగా రాజ్యసభ సమావేశాలకు అంతరాయం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కూడా సభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది.