
భోపాల్ : కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాపై బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మధ్యప్రదేశ్‌లోని కొలారస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ నేత రాధే శ్యాం ధకడ్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేశారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై వేలెత్తి చూపిన వారి చేతులు నరకుతామని, గొంతెత్తితే నాలుక కోస్తామని రాధే శ్యాం హెచ్చరించారు. సీఎం చౌహాన్ కుమారుడు కార్తికేయ చౌహాన్ సమక్షంలో జ్యోతిరాదిత్య సింధియాను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.
జ్యోతిరాదిత్య సింధియా తమ వర్గం గురించి, తమ సీఎం గురించి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాజకీయ కోణంలోనే తమ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని దండిస్తామనే ధోరణిలో ఈ వ్యాఖ్యలు చేశానని సమర్ధించుకున్నారు. జ్యోతిరాదిత్య సింధియాతో తనకెలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని ఆయన చెప్పుకొచ్చారు.