రాజకీయ యువ 2.o | Youth Entry in Politics Lok Sabha Election | Sakshi
Sakshi News home page

రాజకీయ యువ 2.o

Published Wed, Apr 3 2019 9:07 AM | Last Updated on Wed, Apr 3 2019 9:50 AM

Youth Entry in Politics Lok Sabha Election - Sakshi

రాజకీయాల్లో తరం మారుతోంది. సిద్ధాంత రాద్ధాంతాలతో రాటుదేలిన పాత తరం రాజకీయ నేతలను కాదని, పాలనలో సరికొత్త విధానాలూ, వ్యూహాలూ ఆచరణలోకి తీసుకురావాలనే సంకల్పంతో కొత్త తరం, యువతరం రాజకీయ రంగ ప్రవేశం చేస్తోంది. వృత్తి, ఉద్యోగాలకు ఉన్న పరిమితులను గుర్తించి, ప్రజల దైనందిన జీవితాల్లో సమూల మార్పు తీసుకురావాలంటే శాసన నిర్ణేతల అవతారం ఎత్తక తప్పదన్న నిశ్చితాభిప్రాయంతో ఈ నవతరం ఎన్నికల బరిలో పరీక్షకు సిద్ధమవుతోంది. వీరిలో రాజకీయ నేతల వారసులు ఉన్నారు. సొంత రాజకీయ అభిప్రాయాలతో ముందుకు వస్తున్న వారు కూడా ఉన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న వారూ ఉన్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా యువరక్తం ఉరకలు వేస్తోంది. ఉన్నత చదువులు చదువుకొని, వృత్తికో, ఉపాధికో మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా, దేశ రాజకీయాల్లో సత్తాచాటేందుకు సిద్ధమవుతోంది. నవతరం ఆశయాలకూ, ఆకాంక్షలకూ ప్రతిబింబాలైన వీరే నేటి మేటి యువ రాజకీయ హీరోలు. మరి, ఈ తరం ఆకాంక్షల్నీ, అవేశాన్నీ, ఆలోచనల్నీ ఆచరణలోకి తెచ్చేందుకు వారికి స్వాగతం పలుకుదామా?

 గౌరవ్‌ గొగోయి:  యువ ‘ప్రవాహ్‌’
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఎదుగుతోన్న యువ నాయకుడు గౌరవ్‌ గొగోయి. మూడుసార్లు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేసిన తరుణ్‌ గొగోయ్‌ తనయుడితను. న్యూఢిల్లీలో టెక్నాలజీలో డిగ్రీ చేసిన గౌరవ్‌ న్యూయార్క్‌ యూనివర్సిటీలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ‘ప్రవాహ్‌’ అనే స్వచ్ఛంద సంస్థలో పని చేసిన అనుభవం ఆయనలో ప్రజా సమస్యల పరిష్కారంపై ఆసక్తిని పెంచింది. 2014లో తొలిసారి లోక్‌సభకు పోటీచేసి కాంగ్రెస్‌ సభ్యుడిగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అస్సాంలోని కాలియాబోర్‌ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. ఈశాన్య భారత ప్రజల మనోభావాలకు ప్రతీకగా ఆ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతోన్న వ్యక్తిగా తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకున్నారు.

చిరాగ్‌ పాశ్వాన్‌:  రెడీ..యాక్షన్‌
కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ వారసుడు చిరాగ్‌ పాశ్వాన్‌. ఇంజనీరింగ్‌ పట్టభద్రుడు. 2014 ఎన్నికల్లో బిహార్‌లోని జామూయీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌ జనశక్తి పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. చిరాగ్‌.. బిహార్‌లో సర్వం తానే అయి పార్టీని నడిపిస్తున్నారు. తండ్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ రాజకీయ మెళకువలు నేర్పుతూ చిరాగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల జరిగిన సీట్ల పంపకం చర్చలలో రాజకీయ పరిణతిని ప్రదర్శించి, బిహార్‌లో 6 సీట్లలో పోటీ చేయడానికి ఎన్డీయేని ఒప్పించి స్థానికులను మెప్పించారు. చిరాగ్‌ పాశ్వాన్‌ 2011లో ‘మిలే న మిలే’ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ చిత్రం విఫలమవడంతో సినీ జీవితానికి స్వస్తి పలికారు. ప్రజలకు చేరువయ్యేందుకు చిరాగ్‌ ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం జమూయీ నుంచే బరిలోకి దిగారు.

డాక్టర్‌ ప్రీతం ముండే: చెరగని రికార్డు
డాక్టర్‌ ప్రీతం గోపీనాథ్‌ ముండే ప్రముఖ వైద్యురాలు. బీజేపీ ప్రముఖుడు, ఎంపీ, రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచిన గోపీనాథ్‌ ముండే కుమార్తె.  ప్రముఖ బీజేపీ నాయకుడు దివంగత ప్రమోద్‌ మహాజన్‌ మేనకోడలు. తండ్రి మరణానంతరం 2014లో బీడ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో దేశంలో ఇప్పటి వరకూ ఎవరూ సాధించలేని 6,96,321 ఓట్ల ఆధిక్యంతో విజయఢంకా మోగించి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ స్టాండింగ్‌ కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ బీడ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ–శివసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈమె విద్యాభ్యాసం మెడిసిన్‌తో సహా మొత్తం ముంబైలోనే జరిగింది.

అగతా కె సంగ్మా: ‘పిన్న’ ముద్ర
27 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అగతా కె సంగ్మా. తండ్రి పీఏ సంగ్మా రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో మేఘాలయలోని తుర నియోజకవర్గంలో 2008 ఎన్నికల్లో పోటీచేసి ఎన్‌సీపీ నుంచి విజయం సాధించారు. తిరిగి 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సైతం ఇదే స్థానం నుంచే మరోసారి విజయాన్ని కైవసం చేసుకున్నారు. 29 ఏళ్లకే కేంద్ర మంత్రి పదవిని అధిష్టించి మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో పిన్న వయస్కురాలైన మంత్రిగా ముద్ర వేశారు. ఈమె మాజీ కేంద్ర మంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్‌ పీ ఏ సంగ్మా కుమార్తెగానే కాక తన శక్తి సామర్థ్యాలకు పదునుపెట్టుకుని రాజకీయవేత్తగా రాణించారు. ప్రస్తుతం తుర స్థానం నుంచే అధికార పార్టీ నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ తరఫున ప్రత్యర్థులైన ముఖుల్‌ సంగ్మా (కాంగ్రెస్‌), రిక్మాన్‌ జీ మోమిన్‌ (బీజేపీ)తో తలపడుతున్నారు. ఈమె పుణే యూనివర్సిటీ నుంచీ న్యాయవాద పట్టా, ఇంగ్లండ్‌లోని నాటింగ్‌ హామ్‌ యూనివర్సిటీ నుంచీ పర్యావరణ పరిరక్షణలో మాస్టర్స్‌ డిగ్రీని పొంది, న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు.  

డింపుల్‌:  కనౌజ్‌ క్వీన్‌
డింపుల్‌ స్వరాష్ట్రం ఉత్తరాఖండ్‌. తండ్రి ఆర్మీలో పనిచేసిన కారణంగా ఈమె పుణేలో పుట్టి పెరిగి ప్రా«థమిక విద్యాభ్యాసం అక్కడే చేశారు. తదనంతరం తండ్రి ఉద్యోగరీత్యా భటిండా, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో విద్యాభ్యాసం చేశారు. కామర్స్‌లో లక్నో యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందారు. 21 ఏళ్లకే ములాయంసింగ్‌ కుమారుడు అఖిలేష్‌యాదవ్‌ని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌ వాదీ పార్టీ తరఫున విస్తృత ప్రచారం చేసి వార్తల్లోకెక్కారు. అయితే భర్త చాటు భార్యగా కాక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ యూపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. డింపుల్‌ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు విజయం సాధించారు. ఇప్పుడు కూడా అదే లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు.

 హర్‌సిమ్రత్‌ కౌర్‌: మరోసారి ‘క్రౌన్‌’!
హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రి. సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాజకీయ నేపథ్య కుటుంబంలోకి అడుగుపెట్టారు. కౌర్‌ భర్త సుఖ్‌బీర్‌ సింగ్‌ పంజాబ్‌ రాష్ట్ర శిరోమణి అకాలీదళ్‌ అ«ధ్యక్షుడూ, మాజీ ఉప ముఖ్యమంత్రి కూడా. మామ ప్రకాష్‌సింగ్‌ బాదల్‌ ఆ రాష్ట్ర సీఎంగా పనిచేశారు. ఈమె మెట్రిక్యులేషన్‌ పాసయ్యాక టెక్స్‌టైల్‌ డిజైనింగ్‌లో డిప్లొమా చేశారు. 2009 రాజకీయాల్లోకి అడుగుపెట్టి, పంజాబ్‌లోని భటిండా నుంచి అకాలీదళ్‌ పార్టీ టికెట్‌పై 2009, 2014లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ మరణానంతరం 1984లో జరిగిన సిక్కుల ఊచకోతపై 2009 డిసెంబర్‌లో పార్లమెంటులో చేసిన తొలి ఉపన్యాసంతో∙అందరి దృష్టినీ ఆకర్షించారు. సేవ్‌ గర్ల్‌ చైల్డ్‌ అండ్‌ ట్రీస్‌ క్యాంపెయిన్‌లో ప్రముఖంగా పాల్గొన్నారు. ఈసారి భటిండా లేదా ఫిరోజ్‌పూర్‌ నుంచి పోటీ చేయొచ్చు.

శ్రుతీ చౌధరి:  మరోసారి..
రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న శ్రుతీ చౌధరీ, తొలుత న్యాయవాద వృత్తిని చేపట్టి.. పిన్న వయసులోనే 2005లో తన తండ్రి మరణానంతరం రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఢిల్లీలో బీఏ డిగ్రీ, ఆగ్రా బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. తదనంతరం ఇంగ్లం డ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు. ఈమె హరియణా మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్‌ మనవరాలు. తండ్రి సురేందర్‌ సింగ్, తల్లి కిరణ్‌ చౌధరీ ఇద్దరూ హరియణా మంత్రులుగా పనిచేశారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో హరియణాలోని భివానీ–మహేంద్రగఢ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆమె తాత బన్సీలాల్‌ మూడుసార్లూ, తండ్రి సురేందర్‌సింగ్‌ రెండుసార్లూ గెలుపొందా రు. 2014లో ఓటమిపాలైనా, తాజాగా ఈ స్థానం నుంచి మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

జ్యోతీ మీర్దా:  మళ్లీ పోటీకి సిద్ధం
2009లో రాజస్తాన్‌లోని నాగోర్‌ లోక్‌సభ నుంచి ఎంపికయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. డాక్టర్‌ అయిన జ్యోతీ మీర్దా ఫార్మా కంపెనీలు పరిశోధన, అభివృద్ధి రంగాలపై తక్కువ నిధులు ఖర్చు పెట్టడం, అవయవ దాన బిల్లు, హెచ్‌పీవీ వాక్సిన్‌ అంశాలపై ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శించారు. ఈసారి ఎన్నికల్లో అనేక మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆమె అభ్యర్థిత్వంపై అయిష్టత చూపినా.. అధిష్టానం ఇదే స్థానం నుంచి ఆమెకు టికెట్‌ ఖరారు చేసింది. జ్యోతీ మీర్దా మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నాథూరాం మీర్దా మనవరాలు.

తేజస్వీ సూర్య:  యువ తేజం
ప్రతిష్టాత్మక బెంగళూరు సౌత్‌ లోక్‌సభ స్థానం నుంచి యువ కెరటం తేజస్వీ సూర్యని బరిలోకి దింపుతున్నట్టు బీజేపీ ప్రకటించింది. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ ఈ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. ఆయన మరణానంతరం తేజస్వి సూర్యని ఈ స్థానానికి బీజేపీ ఎంపిక చేసింది. అయితే అనంత్‌కుమార్‌ భార్య తేజస్విని అనంత్‌కుమార్‌కు ఈ సీటు దక్కుతుందని అంతా భావించారు. అనూహ్యంగా బీజేపీ 53 ఏళ్ల తేజస్వినికి బదులు.. ఇక్కడి నుంచి 28 ఏళ్ల నవ యువకుడు, న్యాయవాది అయిన తేజస్వి సూర్యని ఎంపిక చేసింది. బెంగళూరులోని బసవన్న గుడి బీజేపీ ఎమ్మెల్యే రవి సుబ్రహ్మణ్యంకి తేజస్వి సూర్య దగ్గరి బంధువు. ఈ యువకుడు బీకే హరిప్రసాద్‌ (కాంగ్రెస్‌)తో తలపడుతున్నారు.

రాఘవ్‌ ఛడ్ఢా:  పోటీలో అందగాడు
యువ చార్టెడ్‌ ఎకౌంటెంట్‌. నిత్యం వార్తల్లో ఉంటూ, ఆమ్‌ఆద్మీ పార్టీలో చాలాకాలంగా కీలక పాత్ర పోషిస్తోన్న ఈ పంజాబీ నవ యువకుడు దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానంలో పోటీకి దిగారు. బడ్జెట్‌ తయారీ సందర్భంగా ఢిల్లీ డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌ మనీషా సిసోడియాకి తోడ్పాటు అందించినందుకు గాను నెలకి ఒక్క రూపాయి వేతనంతో పనిచేసి రికార్డు సృష్టించారు. ఆమ్‌ఆద్మీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న రాఘవ్‌ ఛడ్ఢా దక్షిణ ఢిల్లీ నుంచి ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులతో తలపడబోతున్నారు. ఈ స్థానానికి బీజేపీ, కాంగ్రెస్‌ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే ఓట్ల సంగతెలా ఉన్నా అందగాడు రాఘవ్‌ ఛడ్ఢాకి మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ మాత్రం దండిగానే వస్తున్నాయట. అయితే పెళ్లి చేసుకుంటామని ముందుకొస్తున్న అందరికీ రాఘవ్‌ నుంచి అందుతోన్న రిప్లై ఒక్కటే. అది.. ‘ప్లీజ్‌ ఓట్‌ ఫర్‌ రాఘవ్‌’.

కన్హయ్య కుమార్‌: ఈ తరం ప్రతినిధి
జేఎన్‌యూలో కన్హయ్య కుమార్‌ ఇచ్చిన ఆజాదీ నినాదం రెండేళ్ల క్రితం దేశమంతటా స్వేచ్ఛానాదమై ప్రతిధ్వనించింది. ‘లెనిన్‌గ్రాడ్‌ ఆఫ్‌ బిహార్‌’గా పిలుచుకునే బెగూసరాయి నుంచి యువతరానికి ప్రతినిధిగా కన్హయ్య కుమార్‌ పోటీచేస్తూ సత్తా చాటుకోబోతున్నారు. దళితుల సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్న ఆరోపణలకు దీటుగా వామపక్ష, దళిత ఎజెండాలను కలగలిపి ‘లాల్‌ నీల్‌’ నినాదాన్ని తెరపైకి తెచ్చిన ఈ జేఎన్‌యూ విద్యార్థి సంఘ నాయకుడు.. అభ్యుదయ భావాలున్న విద్యార్థి, యువజనులకు ఆరాధ్యుడు.  జేఎన్‌యూలో పీహెచ్‌డీ చేస్తూ, జేఎన్‌యూ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎదిగి, రాజద్రోహం నేరంపై జైలు జీవితాన్ని అనుభవించారు. జేఎన్‌యూలో స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌లో సెంటర్‌ ఫర్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఎంఫిల్, పీహెచ్‌డీ చేశారు. 2011లో ఈ కోర్సులో చేరిన కన్హయ్య 2018లో తన థీసిస్‌ సమర్పించారు.

అహ్మద్‌నగర్‌ బరి.. యువకుల ఝరి
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి పోటీ అంతా యువకుల మధ్యే కొనసాగుతోంది. పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ముచ్చటగా మూడు పదుల వయసు వారే కావడంతో ఇక్కడ ఎవరు గెలిచినా కొత్త రక్తానికే పదవి సొంతమవుతుంది. ఇక్కడ బీజేపీ–శివసేన అభ్యర్థి సుజయ్‌ విఖే పాటిల్, కాంగ్రెస్‌ ఎన్‌సీపీ కూటమి అభ్యర్థి సంగ్రామ్‌ జగ్‌తప్, బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి సువేంద్ర మ«ధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది. సుజయ్‌ విఖే పాటిల్‌ మొన్నటి వరకు కాంగ్రెస్‌ నాయకుడిగా ఉండి, ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఒప్పందంలో భాగంగా ఎన్‌సీపీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తోంది. దీంతో సుజయ్‌ విఖే పాటిల్‌ బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ దిలీప్‌ గాం«ధీకి టిక్కెట్‌ దక్కక పోవడంతో ఆయన కుమారుడు సువేంద్ర బీజేపీ రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ పోటీలో ఎవరు గెలిచినా యువతరానికే పట్టం దక్కనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement