రాజ్కోట్: రంజీ ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరిగిన సెమీ ఫైనల్లో ముంబై విజయంలో 17 ఏళ్ల పృథ్వీ షా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో మెరిసి ముంబైకు ఘన విజయాన్ని అందించాడు. 175 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 120 పరుగులు చేసి ముఖ్య భూమిక పోషించాడు. అయితే పృథ్వీ షా 99 పరుగుల వద్ద ఉండగా కుటుంబ సభ్యులు తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు.
దాదాపు ఐదు నిమిషాల పాటు(330 సెకండ్లు) షా సెంచరీ కోసం ఎదురుచూస్తూ తమ ఇష్టదైవాలను పూజించారు. అయితే సెంచరీకి ఒక పరుగు దూరంలో పృథ్వీ షా అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తమిళనాడు బౌలర్ విజయ్ శంకర్ వేసిన ఇన్నింగ్స్ 51.0ఓవర్ రెండో బంతికి గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న బాబా ఇంద్రజిత్ కు పృథ్వీ క్యాచ్ ఇచ్చాడు. అయితే అది నో బాల్ కావడంతో పృథ్వీ షా అవుట్ కాకుండా తప్పించుకోవడంతో తండ్రి పంకజ్, నానమ్మ దులేరి హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మిడ్ డే డైలీ ప్రచురించింది.