prithvi shaw
-
పృథ్వీ షాపై వేటు
ముంబై: భారత జట్టు మాజీ సభ్యుడు, టాపార్డర్ బ్యాటర్ పృథ్వీ షాను ముంబై రంజీ జట్టు నుంచి తప్పించారు. ఫామ్‌లో లేకపోవడం, ఫిట్నెస్ సమస్యలు, అనుచిత ప్రవర్తన కారణంగా అతనిపై వేటు పడింది. టీమిండియా ఓపెనర్‌గా అంతర్జాతీయ కెరీర్లో ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడిన 24 ఏళ్ల పృథ్వీ ఇటీవలి కాలంలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం కూడా ముంబై సెలక్టర్ల ఆగ్రహానికి కారణమైంది. తరచూ జట్టు ట్రెయినింగ్ సెషన్లకు డుమ్మా కొట్టడంతో పాటు బరువు పెరిగి మ్యాచ్ ఫిట్నెస్ను కోల్పోవడంతో అతనికి ఉద్వాసన పలికారు. ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ షా నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 7, 12, 1, 39 నాటౌట్ స్కోర్లు చేశాడు. ఫిట్నెస్ సమస్యలతో ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా స్పందించడం లేదు. దీంతో అతన్ని తప్పించి 29 ఏళ్ల ఎడంచేతి ఓపెనింగ్ బ్యాటర్ అఖిల్ హేర్వడ్కర్ను ముంబై జట్టులోకి తీసుకున్నారు. అతను 41 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 36.51 సగటు నమోదు చేశాడు. ఏడు సెంచరీలు, పది అర్ధసెంచరీలు బాదాడు. ముంబై తదుపరి మ్యాచ్‌ను త్రిపురతో ఆడనుంది. అగర్తలాలో ఈ నెల 26 నుంచి 29 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత టి20 కెపె్టన్, మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చారు. -
అదో మంచి అవకాశం వదులుకోవద్దు..?
న్యూఢిల్లీ: అండర్-19 వరల్డ్‌కప్‌ను సాధించి అంతర్జాతీయ క్రికెట్లోకి తారజువ్వలా దూసుకొచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఈ టోర్నీ కుర్రాళ్లకు ఓ మంచి అవకాశమని చెప్పుకొచ్చాడు. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే అండర్-19 వరల్డ్‌కప్ 2018 టోర్నీలో పాల్గొనే భారతజట్టుకు యువసంచలనం పృథ్వీషా నేతృత్వం వహిస్తుండగా.. మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా కోహ్లి కుర్రాళ్లను ఉద్దేశించి ఐసీసీ మీడియాతో మాట్లాడాడు. ‘అండర్-19 వరల్డ్‌కప్ నాజీవితంలో ఓ గొప్ప మైలురాయి. కెరీర్‌ను తీర్చిదిద్దుకునే అవకాశమిచ్చిన ఈ టోర్నీ నా మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ టోర్నీతో మంచి భవిష్యత్తుంటుందని భావించి ఈ అవకాశాన్ని కుర్రాళ్లు అందిపుచ్చుకోవాలని’ కోహ్లి సూచించాడు. తన అండర్-19 టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్‌ను గుర్తుచేసుకున్న కోహ్లి న్యూజిలాండ్ అప్పటి ఇప్పటి కెప్టెన్ కన్నెవిలియమ్సన్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. స్టీవ్‌స్మిత్ గురించి స్పందిస్తూ.. తన జట్టు వారితో తలపడలేదని, కానీ అతను తర్వాతి రోజుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడని తెలిపాడు. ఈ ముగ్గురు కెప్టెన్లేమే కాదు చాలా మంది ఈ టోర్నీ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు ఎదిగారని కోహ్లి పేర్కొన్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కన్నే విలియమ్సన్ మాట్లాడుతూ.. ఇది కుర్రాళ్లకు జీవితంలో ఓ మెట్టులాంటిది. నాలుగేళ్లకోసారి జరిగే సీనియర్ క్రికెటర్ల వరల్డ్‌కప్‌లో ఎంతమందికి అవకాశం వస్తుందో చెప్పలేమని, రెండేళ్లకోసారి జరిగే ఈ ప్రపంచకప్‌ను కుర్రాళ్లు సద్వినియోగం చేసుకోవాలన్నాడు. -
పృథ్వీ షాతో ఎంఆర్ఎఫ్ ఒప్పందం
ముంబై: దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న ముంబై యువ సంచలనం పృథ్వీ షాకు గొప్ప అవకాశం లభించింది. ప్రముఖ టైర్ల సంస్థ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (ఎంఆర్ఎఫ్) ఈ యువ క్రికెటర్‌తో ఒప్పందం చేసుకుంది. వచ్చే జనవరిలో న్యూజిలాండ్‌లో జరిగే అండర్–19 ప్రపంచకప్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న పృథ్వీ షా తాజా ఒప్పందంతో సచిన్, కోహ్లిలాంటి మేటి క్రికెటర్ల సరసన చేరాడు. ‘నాతో ఒప్పందం చేసుకున్నందుకు ఎంఆర్ఎఫ్ సంస్థకు కృతజ్ఞతలు. సచిన్, కోహ్లి, లారాలు ఈ లోగోను ధరించి టన్నుల కొద్దీ పరుగులు సాధించారు. చిన్నప్పటి నుంచి వారినే ఆదర్శంగా తీసుకుంటూ పెరిగిన నేను కూడా త్వరలోనే ఈ బ్యాట్‌తో బరిలోకి దిగుతాను’ అని పృథ్వీ షా అన్నాడు. -
కెప్టెన్‌గా పృథ్వీ షా
న్యూఢిల్లీ: ముంబై యువ సంచలనం పృథ్వీ షా యువ భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఐసీసీ అండర్–19 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ఆదివారం బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వచ్చే ఏడాది జరిగే ఈ అండర్–19 టోర్నీకి న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే ఈ టీమ్‌లో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం. క్రితంసారి ఈ మెగా టోర్నీలో రన్నరప్ అయిన భారత్ మూడు సార్లు (1988, 2002, 2010) విజేతగా నిలిచింది. భారత అండర్–19 జట్టు: పృథ్వీ షా (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), మన్జోత్ కల్రా, హిమాన్షు రాణా, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఆర్యన్ జుయల్, హార్విక్ దేశాయ్ (వీళ్లిద్దరు వికెట్ కీపర్లు), శివమ్ మావి, కమలేశ్ నాగర్కోటి, ఇషాన్ పొరెల్, అర్‡్షదీప్ సింగ్, అనుకూల్ రాయ్, శివా సింగ్, పంకజ్ యాదవ్. స్టాండ్‌బైలు: ఓం భోస్లే, రాహుల్ చహర్, నినద్ రథ్వా, ఉర్విల్ పటేల్, ఆదిత్య థాకరే. -
పృథ్వీ షా మరో సెంచరీ
సాక్షి, ఒంగోలు: ముంబై యువ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా (173 బంతుల్లో 114; 14 ఫోర్లు, 1 సిక్స్) రంజీ ట్రోఫీలో మళ్లీ సెంచరీతో చెలరేగాడు. షా సెంచరీకి తోడు సిద్ధేశ్ లాడ్ (86) కూడా రాణించడంతో శుక్రవారం ఆంధ్రతో ప్రారంభమైన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఈ రంజీ సీజన్లో పృథ్వీ షాకు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. 64 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన దశలో పృథ్వీ, లాడ్ కలిసి ముంబై జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 125 పరుగులు జోడించగా, శ్రేయస్ అయ్యర్ (0) విఫలమయ్యాడు. ఆంధ్రా బౌలర్లలో అయ్యప్పకు 3 వికెట్లు దక్కాయి. హైదరాబాద్ 289/8 గువహటిలోని బర్సాపర స్టేడియంలో అస్సాంతో జరుగుతున్న గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి రోజు 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. కెప్టెన్ అంబటి రాయుడు (83), బావనక సందీప్ (84) అర్ధ సెంచరీలతో రాణించారు. 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన హైదరాబాద్‌ను రాయుడు, సందీప్ ఐదో వికెట్‌కు 157 పరుగులు జోడించి ఆదుకున్నారు. -
ఛోటా బాద్'షా'
సరిగ్గా నాలుగేళ్ల క్రితం... 14 సంవత్సరాల పృథ్వీ షా అత్యద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ముంబైలో హారిస్ షీల్డ్ టోర్నీలో భాగంగా రిజ్వీ స్కూల్ తరఫున బరిలోకి దిగిన పృథ్వీ ఏకంగా 546 పరుగులు బాది మైనర్ క్రికెట్లో అత్యధికపరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 85 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే చిన్నతనంలో సంచలనాలు నమోదు చేసి ఆ తర్వాత కనుమరుగైపోయిన అనేక మంది ఆటగాళ్ల జాబితాలో మాత్రం అతను చేరలేదు. అప్పటి నుంచి మొదలు పెట్టి నేటి వరకు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పరుగుల వరద పారించాడు. స్కూల్ క్రికెట్లో మాత్రమే కాదు సీనియర్ క్రికెట్లోనూ తన బ్యాటింగ్ పదునేమిటో అతను చూపించాడు. ఆడిన ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే నాలుగు సెంచరీలు బాది భవిష్యత్ తారగా, మరో సచిన్‌గా పృథ్వీ షా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ నెల 8తో 18 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న పృథ్వీ నిజంగానే ఆ స్థాయికి చేరుకోవాలని అంతా కోరుకుంటున్నారు. సాక్షి క్రీడా విభాగం: వరుసగా భారీ స్కోర్లు సాధించడం పృథ్వీ షాకు కొత్త కాదు. తనకు గుర్తింపు తెచ్చిన 546 ఇన్నింగ్స్‌కు రెండేళ్ల ముందునుంచే షా గురించి ముంబై క్రికెట్ వర్గాల్లో మంచి అభిప్రాయం ఉంది. స్కూల్ క్రికెట్లో వరుసగా జరిగిన ఆరు టోర్నీలలో 13 సెంచరీలు, 5 అర్ధసెంచరీలతో 2000కు పైగా పరుగులు నమోదు చేయడమే దానికి కారణం. ఇందులో గైల్స్ షీల్డ్ టోర్నీలో చేసిన ఐదు వరుస శతకాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో స్వయంగా సచిన్ టెండూల్కర్ కూడా ప్రత్యేకంగా పృథ్వీ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరై అభినందనలతో ముంచెత్తాడు. ‘ఆ సమయంలో నా ఎత్తుకు తగినట్లుగా ప్రత్యేకంగా తయారు చేయించిన ఎస్జీ ప్రొఫెషనల్ బ్యాట్‌ను సచిన్ నాకు బహుమతిగా ఇవ్వడం ఎప్పటికీ మరచిపోలేను. అది నాకు మరింత స్ఫూర్తినిచ్చింది’ అని పృథ్వీ గుర్తు చేసుకుంటాడు. ప్రఖ్యాత ‘కంగా’ లీగ్ ‘ఎ’ డివిజన్ పోటీల్లో కూడా అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందిన షా, ఆపై వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత తన సీనియర్లు సర్ఫరాజ్ ఖాన్, అర్మాన్ జాఫర్ సభ్యులుగా ఉన్న ముంబై అండర్–16కు షా కెప్టెన్‌గా ఎంపిక కావడం, మరింత వేగంగా దూసుకుపోవడం చకచకా జరిగిపోయాయి. సీనియర్ స్థాయిలో చెలరేగుతూ... చిన్న వయసే అయినా పృథ్వీ షాను ఇక ఆపడం సాధ్యం కాలేదు. ఇక ఒక్కో ఘనత అతని ఖాతాలో చేరుతూ పోయింది. ఈ ఏడాది జనవరిలో రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌తో ముంబై తరఫున అతని ఫస్ట్ క్లాస్ అరంగేట్రం జరిగింది. తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ సెంచరీతో జట్టును గెలిపించి షా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవడం విశేషం. 1993 తర్వాత ముంబై క్రికెటర్ ఒకరు తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం ఇదే తొలిసారి. అదే జోరును తాజా సీజన్లో కూడా కొనసాగిస్తూ షా, మూడు సెంచరీలు బాదాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ చేసిన అతని పిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. గత పది ఇన్నింగ్స్‌లలో పృథ్వీ వరుసగా 4, 120, 71, 44, 154, 31, 123, 5, 105, 46 స్కోరు చేశాడు. ఇటీవల బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తరఫున ట్రెంట్ బౌల్ట్ ఆశ్చర్యపోయేలా అతడిని ఎదుర్కొన్న తీరు షా అంతర్జాతీయ ఆటకు కూడా సిద్ధంగా ఉన్నాడని చెబుతోంది. తాజాగా ఒడిషాతో జరుగుతోన్న మ్యాచ్‌లో సీనియర్ రహానేతో కలిసి పృథ్వీ 136 పరుగుల భాగస్వామ్యం నమోదు చేస్తే అందులో షా 99 పరుగులు చేయగా, రహానే వాటా 34 పరుగులే! సొంతగడ్డపై శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో అతడిని ఎంపిక చేయాలని ఇప్పుడు అన్ని వైపుల నుంచి డిమాండ్ వస్తుండటం విశేషం. అతని షాట్లలో, ఆటలో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ప్రస్తుతం తన వయసు వారిలో అతనే అత్యుత్తమం అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఓపెనర్ కావాల్సిన అన్ని అర్హతలు అతనిలో ఉన్నాయి. వరుసగా భారీ స్కోర్లు చేయడం అతడిని మరింత నైపుణ్యం గల ఆటగాడిగా మారుస్తుంది. పృథ్వీకి తన ఆటపై చాలా నమ్మ కం ఉంది. ముంబై సెలక్టర్లు అతనిపై నమ్మకముంచారు. అవకాశం ఇస్తే అంతర్జాతీయ స్థాయిలోనూ బాగా ఆడగల సత్తా ఈ కుర్రాడిలో ఉంది. – ప్రవీణ్ ఆమ్రే, ముంబై మాజీ కెప్టెన్, కోచ్ తండ్రి ప్రోత్సాహంతో... ముంబైకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే శివారు ప్రాంతం విరార్ పృథ్వీ స్వస్థలం. తండ్రి పంకజ్ షా చిరు వ్యాపారి కాగా షా నాలుగేళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. ఎనిమిదేళ్ల చిన్న వయసులోనే రోజూ గంటన్నరకు పైగా ప్రయాణం చేసి ముంబై నగరంలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో పృథ్వీ సాధన చేసేవాడు. కొడుకును ఎలాగైనా క్రికెటర్‌ను చేయాలన్న తండ్రి పట్టుదల, అందుకు తగినట్లుగా ఎప్పుడూ శ్రమకు వెనుకాడని పృథ్వీ తత్వం కలగలిసి కఠోర కోచింగ్ కొనసాగింది. చివరకు ఇతని ప్రతిభను గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే ఒకరు మైదానం దగ్గర్లో ఉండేందుకు ఒక ఫ్లాట్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రిజ్వీ స్ప్రింగ్ఫీల్డ్ తమ క్రికెట్ జట్టులో చేర్చుకొని ఉచిత విద్య అందించడంతో పాటు అదనంగా స్కాలర్షిప్ కూడా ఇవ్వడంతో పృథ్వీకి ఇతర విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. ఆ తర్వాత అవకాశం దొరికిన ప్రతీసారి అతను దానిని సమర్థంగా ఉపయోగించుకున్నాడు. ముంబై అండర్–19 తరఫున చెలరేగిన తర్వాత భారత అండర్–19 జట్టులోకి ఎంపికైన షా, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. -
వార్మప్‌లోనే వణికారు...
భారత్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందే న్యూజిలాండ్ జట్టుకు షాక్ తగిలింది. అంతగా అంతర్జాతీయ అనుభవం లేని బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ బౌలర్ల ఉచ్చులో పడి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. అటు పేస్.. ఇటు స్పిన్‌ను ఎదుర్కొనేందుకు తంటాలు పడడంతో మున్ముందు కోహ్లి సేనతో పోరు ఎలా ఉండబోతోందో తెలిసొచ్చింది. అంతకుముందు టీనేజి సెన్సేషన్ పృథ్వీ షా తన అద్భుత బ్యాటింగ్ నైపుణ్యాన్ని చాటుకోగా.. రాహుల్, కరుణ్ అర్ధ సెంచరీలతో చెలరేగి జట్టుకు భారీ స్కోరును అందించారు.. ముంబై: మూడు వన్డేల సిరీస్ కోసం జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 30 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మంగళవారం బ్రబౌర్న్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు అన్ని విభాగాల్లో చెలరేగి కివీస్‌ను వణికించింది. టీమిండియా భవిష్యత్ తారగా చెప్పుకుంటున్న 17 ఏళ్ల పృథ్వీ షా (80 బంతుల్లో 66; 9 ఫోర్లు, 1 సిక్స్) అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కొని ఆడిన తీరు ఆకట్టుకుంది. అతడికి తోడు కేఎల్ రాహుల్ (75 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ (64 బంతుల్లో 78; 12 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బోర్డు ఎలెవన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 295 పరుగుల భారీ స్కోరు సాధించింది. బౌల్ట్‌కు ఐదు వికెట్లు దక్కాయి. రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఇదే మైదానంలో గురువారం జరుగుతుంది. సూపర్ పృథ్వీ... ఓపెనర్‌గా బరిలోకి దిగిన ‘లోకల్ బాయ్’ పృథ్వీ తొలిసారిగా ఓ సీనియర్ అంతర్జాతీయ జట్టును ఎదుర్కొన్నా ఎలాంటి తడబాటు లేకుండా ఆడాడు. ప్రారంభంలో రాహుల్ కాస్త వేగంగా ఆడినా ఆ తర్వాత షా దూకుడు కనిపించింది. పేసర్ ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో కవర్ మీదుగా తను అద్భుత సిక్సర్ బాదాడు. అటు 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ అవుటైనా అది నోబాల్‌గా తేలింది. వీరిద్దరూ 62 బంతుల్లోనే తమ అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. తొలి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం జత చేసిన అనంతరం ఈ జోడి వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత కరుణ్ నాయర్ తన లాఫ్టెడ్ డ్రైవ్‌లతో కివీస్ బౌలర్లపై దాదాపు చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 47.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లాథమ్ (63 బంతుల్లో 59; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా విలియమ్సన్ (49 బంతుల్లో 47; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మూడు బంతుల వ్యవధిలో ఎడమచేతి స్పిన్నర్ షాబాజ్ నదీమ్ రెండు వికెట్లు తీయడంతో ఓ దశలో కివీస్ 204 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. చివర్లో గ్రాండ్‌హోమ్ (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడినా ఫలితం లేకపోయింది. లెఫ్టార్మ్ మీడియం పేసర్ జయదేవ్ ఉనాద్కట్, నదీమ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. -
పృథ్వీ షా రంజీల్లోనే ఆడాలి!
న్యూఢిల్లీ: కెరీర్లో తొలి రంజీ ట్రోఫీ, తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లలోనే సెంచరీలు సాధించి సత్తా చాటిన 17 ఏళ్ల ముంబై సంచలన బ్యాట్స్‌మన్ పృథ్వీ షా విషయంలో జూనియర్ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అతను మున్ముందు మరింత ఎదగాలంటే రంజీ ట్రోఫీలో ఆడటం ముఖ్యమని భావించింది. అందుకే అండర్–19 ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టులోకి పృథ్వీని ఎంపిక చేయలేదు. సోమవారం ప్రకటించిన ఈ జట్టుకు హిమాన్షు రాణా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. గత ఆగస్టులో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత అండర్–19 జట్టుకు షా కెప్టెన్‌గా ఉన్నాడు. పృథ్వీ షా రంజీల్లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ‘భారత అండర్–19, ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. పృథ్వీ ఈ దశలో రంజీలపై దృష్టి పెట్టడమే సరైనదిగా ఆయన అభిప్రాయపడ్డారు’ అని ఒక సెలక్టర్ వెల్లడించారు. నవంబర్ 9 నుంచి 20 వరకు మలేసియాలో ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది. జట్టు వివరాలు: హిమాన్షు రాణా (కెప్టెన్), అభిషేక్ శర్మ (వైస్ కెప్టెన్), అథర్వ తైడే, మన్జోత్ కల్రా, సల్మాన్ ఖాన్, అనూజ్ రావత్, హార్విక్ దేశాయ్, రియాన్ పరాగ్, అనుకూల్ రాయ్, శివ సింగ్, తనుష్ కొటియాన్, దర్శన్ నల్కండే, వివేకానంద్ తివారి, ఆదిత్య థాకరే, మన్దీప్ సింగ్ సౌత్‌జోన్ అండర్–19 జట్టు కూడా... బీసీసీఐ ఇంటర్ జోనల్ వన్డే టోర్నమెంట్లో పాల్గొనే సౌత్ జోన్ అండర్–19 జట్టును ప్రకటించారు. హైదరాబాద్, ఆంధ్ర జట్ల నుంచి ముగ్గురేసి ఆటగాళ్లు ఇందులోకి ఎంపికయ్యారు. హైదరాబాద్ తరఫున ఠాకూర్ తిలక్ వర్మ, సాయి ప్రజ్ఞారెడ్డి, వరుణ్ గౌడ్లకు స్థానం లభించగా... ఆంధ్ర క్రికెటర్లు కె.మహీప్ కుమార్, ఎస్ ఎండీ రఫీ, బి.వినయ్ కుమార్‌లకు జట్టులో అవకాశం దక్కింది. -
కదంతొక్కిన శుభ్‌మాన్, పృథ్వీ షా
ముంబై: తొలుత బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. ఆ తర్వాత బౌలర్లు విజృంభించారు. వెరసి ఇంగ్లండ్ అండర్–19 జట్టుపై భారత అండర్–19 జట్టు 230 పరుగుల భారీ ఆధిక్యంతో గెలిచింది. తాజా విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3–1తో ఆధిక్యంలోకి వెళ్లి సిరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 382 పరుగుల భారీ స్కోరును చేసింది. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ (120 బంతుల్లో 160; 23 ఫోర్లు, ఒక సిక్స్), పృథ్వీ షా (89 బంతుల్లో 105; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 231 పరుగులు జోడించారు. 383 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు కమలేశ్ నాగర్కోటి (4/31), వివేకానంద్ తివారి (3/20), శివమ్ (2/18) దెబ్బతీశారు. దాంతో ఇంగ్లండ్ 37.4 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. -
ఆ ఐదు నిమిషాలు ఇలా..
రాజ్‌కోట్: రంజీ ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరిగిన సెమీ ఫైనల్లో ముంబై విజయంలో 17 ఏళ్ల పృథ్వీ షా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిసి ముంబైకు ఘన విజయాన్ని అందించాడు. 175 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 120 పరుగులు చేసి ముఖ్య భూమిక పోషించాడు. అయితే పృథ్వీ షా 99 పరుగుల వద్ద ఉండగా కుటుంబ సభ్యులు తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. దాదాపు ఐదు నిమిషాల పాటు(330 సెకండ్లు) షా సెంచరీ కోసం ఎదురుచూస్తూ తమ ఇష్టదైవాలను పూజించారు. అయితే సెంచరీకి ఒక పరుగు దూరంలో పృథ్వీ షా అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తమిళనాడు బౌలర్ విజయ్ శంకర్ వేసిన ఇన్నింగ్స్ 51.0ఓవర్ రెండో బంతికి గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న బాబా ఇంద్రజిత్ కు పృథ్వీ క్యాచ్ ఇచ్చాడు. అయితే అది నో బాల్ కావడంతో పృథ్వీ షా అవుట్ కాకుండా తప్పించుకోవడంతో తండ్రి పంకజ్, నానమ్మ దులేరి హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మిడ్ డే డైలీ ప్రచురించింది. -
అరంగేట్రంలోనే అదుర్స్
రాజ్‌కోట్:తమిళనాడుతో జరిగిన సెమీ ఫైనల్లో గెలిచిన ముంబై జట్టు మరోసారి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. తమిళనాడు విసిరిన 251 లక్ష్యాన్ని ముంబై నాలుగు వికెట్లు కోల్పోయి 62.1 ఓవర్లలో ఛేదించింది. ముంబై ఓపెనర్ పృథ్వీ షా(120;175 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్) శతకం చేయడంతో ముంబై జట్టు సునాయాసంగా గెలిచింది. ఇది పృథ్వీ షాకు అరంగేట్రం మ్యాచ్ కావడం విశేషం. ముంబై తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన షా.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం శతకంతో మెరిశాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అదుర్స్ అనిపించి దిగ్గజాల సరసన 17 ఏళ్ల షా నిలిచాడు. ముంబై తరపున అరంగేట్రంలోనే సెంచరీలు సాధించిన 11వ ఆటగాడిగా షా గుర్తింపు సాధించాడు. ఈ రోజు ఆటలో రెండు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన షా ఆద్యంతం ఆకట్టుకున్నాడు.తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయగా, రెండో వికెట్‌కు మరో 91 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. దాంతో ముంబై సునాయాసంగా విజయం సాధించింది. ఇదిలా ఉంచితే, ముంబై జట్టు వరుసగా రెండోసారి ఫైనల్ చేరగా, ఓవరాల్‌గా 46సార్లు తుది బెర్తును ఖాయం చేసుకోవడం ఇక్కడ విశేషం. జనవరి 10వ తేదీ నుంచి జరిగే ఫైనల్లో గుజరాత్‌తో ముంబై తలపడనుంది. -
85 ఫోర్లు, 5 సిక్సర్లు.. 546 పరుగులు
ముంబై టీనేజ్ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా జాతీయ రికార్డు సృష్టించాడు. అంతర్ పాఠశాలల టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా 15 ఏళ్ల పృథ్వీ (85 ఫోర్లు, 5 సిక్సర్లతో 546) రికార్డ్ బ్రేక్ చేశాడు. ప్రతిష్టాత్మక హారీస్ షీల్డ్ టోర్నీలో భాగంగా ఆజాద్ మైదాన్‌లో బుధవారం సెయింట్ ఫ్రాన్సిస్ డీ అస్సిసి బోరివలి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రిజ్వి స్ప్రింగ్ఫీల్డ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ రికార్డు ఇప్పటిదాకా టీమిండియా మాజీ ఓపెనర్ వసం జాఫర్ మేనల్లుడు ఆర్మన్ (498) పేరిట ఉంది. తాజాగా పృథ్వీ బద్దలు కొట్టాడు. మహారాష్ట్ర అండర్-16 జట్టుకు పృథ్వీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా వీరిద్దరూ రిజ్వి స్ప్రింగ్ఫీల్డ్ పాఠశాల విద్యార్థులు కావడం విశేషం. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ కూడా హారీస్ షీల్డ్ టోర్నీ ద్వారానే తొలుతు వెలుగులోకి వచ్చాడు. వినోద్ కాంబ్లీతో కలసి మాస్టర్ రికార్డు భాగస్వామ్యం (664) నెలకొల్పాడు.