
దుమ్మురేపిన షఫీఖుల్లా
అఫ్ఘానిస్థాన్ విజయం
హాంకాంగ్ ఆశలు గల్లంతు
టి20 ప్రపంచకప్ అర్హత టోర్నీ
చిట్టగాంగ్: షహజాద్ (53 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), షఫీఖుల్లా (24 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ 7 వికెట్ల తేడాతో హాంకాంగ్‌ను చిత్తు చేసింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో తొలుత హాంకాంగ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది.
చాప్‌మన్ (43 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్సర్), వకాస్ (32 బంతుల్లో 32; 3 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్థాన్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. నజీబ్ (7), అస్గర్ (13) విఫలమైనా... షహజాద్, షఫీఖుల్లా చెలరేగిపోయారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. రెండో ఓటమితో హాంకాంగ్ ప్రధాన టోర్నీకి అర్హత పొందే అవకాశాలు ఆవిరయ్యాయి.