ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత బరోడా
రెండో సారి టైటిల్ కైవసం
ఫైనల్లో ఉత్తర ప్రదేశ్‌పై గెలుపు
ముంబై: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ ఫైనల్ మ్యాచ్... ఉత్తరప్రదేశ్ విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి ఉంది. బరోడా తరఫున లెఫ్టార్మ్ పేసర్ రిషీ అరోథ్ బౌలర్ కాగా...ప్రవీణ్ కుమార్, ఉపేంద్ర యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు. రిషీ చక్కటి బంతులతో కట్టడి చేయడంతో ప్రవీణ్ తొలి మూడు బంతులకు ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. నాలుగో బంతికి సింగిల్ వచ్చింది.
ఐదో బంతిని ఉపేంద్ర సిక్సర్‌గా మలిచాడు. ఆఖరి బంతికి నాలుగు పరుగులు చేస్తే గెలుస్తుందనగా, ఫుల్ టాస్‌ను ఆడబోయి అతను అవుటయ్యాడు. ఫలితంగా 3 పరుగుల తేడాతో నెగ్గిన బరోడా దేశవాళీ టి20 టోర్నీని కైవసం చేసుకుంది. 2012 తర్వాత ముస్తాక్ అలీ ట్రోఫీని బరోడా మరో సారి గెలుచుకోవడం విశేషం.
రాణించిన వాఘ్‌మోడ్...
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. కెప్టెన్ ఆదిత్య వాఘ్‌మోడ్ (31 బంతుల్లో 42; 8 ఫోర్లు) ధాటిగా ఆడగా, కేదార్ దేవ్‌ధర్ (32 బంతుల్లో 26; 2 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 22; 1 ఫోర్) అతనికి అండగా నిలిచారు. యూపీ బౌలర్లలో ప్రవీణ్ కుమార్, ముర్తజా చెరో 2 వికెట్లు పడగొట్టారు.
భారీ భాగస్వామ్యం...
ముకుల్ దాగర్ (3) ఆరంభంలోనే వెనుదిరిగినా...ప్రశాంత్ గుప్తా (53 బంతుల్లో 68; 8 ఫోర్లు, 1 సిక్స్), ఏకలవ్య ద్వివేది (47 బంతుల్లో 56; 6 ఫోర్లు) భారీ భాగస్వామ్యంతో ఉత్తరప్రదేశ్‌ను గెలుపు దిశగా నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 81 బంతుల్లో 98 పరుగులు జోడించారు.
వీరి జోరుతో బరోడా 116/1 స్కోరుతో నిలిచింది. అయితే మేరివాలా బౌలింగ్‌లో గుప్తా అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఈ దశలో గెలిచేందుకు చేతిలో 8 వికెట్లతో 26 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన యూపీ 25 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో యూపీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులు మాత్రమే చేయగలిగింది.