రొమెరో...ద హీరో | Brazil's Misery Worsens With Argentina in Final | Sakshi
Sakshi News home page

రొమెరో...ద హీరో

Published Fri, Jul 11 2014 1:13 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

రొమెరో...ద హీరో - Sakshi

రొమెరో...ద హీరో

అర్జెంటీనాను గెలిపించిన గోల్ కీపర్
 పెనాల్టీ షూటౌట్‌లో 4-2తో
 నెదర్లాండ్స్‌పై విజయం
 ఆదివారం జర్మనీతో ఫైనల్
 
 ప్చ్... ఇదేం ఆట..!
 జర్మనీ, బ్రెజిల్‌ల సెమీస్‌లో దూకుడు చూసిన తర్వాత నెదర్లాండ్స్, అర్జెంటీనాల సెమీస్ చూసిన అభిమానుల భావన ఇది.రెండు జట్లూ అతి జాగ్రత్తకు పోయాయి.ఇరు జట్లలో కావలసినంత మంది స్టార్స్ ఉన్నా ఆటలో వేగం లేదు.90 నిమిషాల పాటు అత్యంత బోరింగ్ ఆట.ఎక్స్‌ట్రా టైమ్ 30 నిమిషాల్లోనూ అదే పరిస్థితి.ె
 
 పనాల్టీ షూటౌట్‌లో మాత్రమే మజా వచ్చింది. క్వార్టర్ ఫైనల్లో షూటౌట్‌లోనే గట్టెక్కిన డచ్ జట్టు ఈసారి ‘ఢమాల్’ అంది... అర్జెంటీనా గోల్ కీపర్ రొమెరో రెండు సార్లు అద్భుతంగా డైవ్ చేసి... రెండు గోల్స్ ఆపేశాడు.అంతే... అర్జెంటీనా అభిమానుల రెండు పుష్కరాల ‘కల’ సాకారమైంది.మెస్సీ సేన ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది.ఇక ఆదివారం జరిగే ఫైనల్లో జర్మనీతో అర్జెంటీనా అమీతుమీ తేల్చుకుంటుంది.
 
 1990 ఫైనల్లో జర్మనీ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని అర్జెంటీనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అప్పటి జట్టుకు డిగో మారడోనా సారథ్యం వహించాడు.
 
 సోమవారం మరణించిన ఫుట్‌బాల్ మాజీ దిగ్గజం అల్ఫ్రెడో డి స్టెఫానో మృతికి సంతాపకంగా మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించారు. అర్జెంటీనా ఆటగాళ్లు చేతికి ఆర్మ్ బ్యాండ్‌ను ధరించి మ్యాచ్ ఆడారు.
 
 ఫలించని వ్యూహం
 క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు ఊహించని ఎత్తులు వేసిన డచ్ కోచ్ వాన్ గాల్ ఈ మ్యాచ్‌లో నిరాశపర్చారు. పటిష్టమైన అర్జెంటీనా రక్షణ శ్రేణిని ఛేదించే ఎత్తుగడలు వేయలేకపోవడంతో మ్యాచ్ బోరింగ్‌గా సాగింది. కేవలం రెండంగుళాల ఎత్తును పరిగణనలోకి తీసుకుని క్వార్టర్స్ మ్యాచ్‌ను గెలిపించిన వాన్ గాల్... మెస్సీసేనను ఆపడానికి ఎలాంటి వ్యూహ రచన చేయలేకపోయారు. పెనాల్టీ షూటౌట్‌లో తొలి అవకాశం అనుభవజ్ఞుడికి కాకుండా వ్లార్‌కు ఇవ్వడాన్ని విమర్శకులు తప్పుబట్టారు. అయితే తొలి పెనాల్టీని తీసుకోవడానికి ఇద్దరు ఆటగాళ్లు నిరాకరించడంతో వ్లార్‌ను పంపామని ఆయన చెప్పారు.
 
 సావో పాలో: షూటౌట్‌లో గోల్ కీపర్ అద్భుత నైపుణ్యం... గురి తప్పని కిక్‌లు... అర్జెంటీనాను 24 సంవత్సరాల తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 4-2తో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయంతో పాటు ఎక్స్‌ట్రా టైమ్‌లో కూడా ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని రాబట్టారు. పెనాల్టీ షూటౌట్‌లో కెప్టెన్ మెస్సీ, గ్యారె, అగురో, రొడ్రిగ్వేజ్‌లు అర్జెంటీనాకు గోల్స్ అందించారు.

 
  నెదర్లాండ్స్ ప్లేయర్లు రాబెన్, కుయుట్ గోల్స్ చేయగా, వ్లార్, స్నిడెర్ కొట్టిన బంతులను అర్జెంటీనా గోల్ కీపర్ సెర్గియో రొమెరో అద్భుతంగా అడ్డుకున్నాడు. రొమెరోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మొత్తానికి ఓ యూరోపియన్ జట్టు జర్మనీ, దక్షిణ అమెరికా ఖండానికి చెందిన  అర్జెంటీనా... ఆదివారం జరిగే టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. శనివారం మూడోస్థానం కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో బ్రెజిల్... నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. గత ప్రపంచకప్‌లో ఫైనల్లో ఓడిన ‘ఆరెంజ్ సేన’ ఈసారి సెమీస్‌తోనే సరిపెట్టుకుంది.
 
 ఆరంభంలో ఇరుజట్లు బంతిపై పట్టు కోసం బాగా పోరాడాయి. క్రమం తప్పకుండా పరస్పరం ఎదురు దాడులు చేసుకున్నా... రెండు జట్లు సమర్థంగా నిలువరించుకున్నాయి. దీంతో గోల్స్ చేసే అవకాశాలు తక్కువగా వచ్చాయి.
 
 6వ నిమిషంలో రాబెన్ (డచ్) కొట్టిన ఓ షాట్‌ను అంపైర్లు ఆఫ్‌సైడ్‌గా తేల్చారు. 11వ నిమిషంలో స్నిడెర్ (డచ్) సంధించిన బంతి రొమెరోను తగులుతూ దూరంగా వెళ్లింది.
 
 15వ నిమిషంలో మెస్సీ ఎడమ వైపు నుంచి కొట్టిన బంతిని గోల్ పోస్ట్ ముందర డచ్ గోల్ కీపర్ సిలిసెన్ చాలా తెలివిగా అందుకున్నాడు.
 
 20వ నిమిషంలో మెస్సీ కొట్టిన ఫ్రీ కిక్‌ను గోల్ కీపర్ సిల్లెసన్ కుడివైపు డైవ్ చేస్తూ అద్భుతంగా అడ్డుకోవడంతో డచ్ ఊపిరి పీల్చుకుంది.
 
 అర్జెంటీనా కెప్టెన్ మెస్సీని కట్టడి చేయడంలో డచ్ ఆటగాళ్లు సఫలమయ్యారు. ముఖ్యంగా రాన్ వ్లార్.. మెస్సీ వెన్నంటే ఉంటూ ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు.
 
 ఓవరాల్‌గా తొలి అర్ధభాగంలో 53 శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న అర్జెంటీనా గోల్స్ కోసం మూడు ప్రయత్నాలు చేయగా, నెదర్లాండ్స్‌కు ఒకే ఒక్క అవకాశం వచ్చింది. కడుపు నొప్పితో బాధపడిన వాన్ పెర్సీ సకాలంలో కోలుకోవడంతో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.
 
  అయితే పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఎక్స్‌ట్రా టైమ్‌లో బయటకు వెళ్లిపోయాడు.
 75వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ హిగుయాన్ గోల్ చేసినంత పని చేశాడు. డచ్ రక్షణ శ్రేణిని ఛేదించుకుంటూ పెరెజ్ ఇచ్చిన పాస్‌ను హిగుయాన్ బలంగా గోల్‌పోస్ట్ వైపు పంపాడు. కానీ అది తృటిలో బయటకు వెళ్లిపోయింది.
 
 87వ నిమిషంలో రాబెన్, స్నిడెర్ (డచ్)లను తప్పిస్తూ రోజో, గ్యారె (అర్జెంటీనా) సమయోచితంగా బంతిని ముందుకు తీసుకెళ్లారు. అయితే గోల్ పోస్ట్ దగ్గర్లో సిల్లెసన్ దాన్ని నిలువరించాడు.
 
 90వ నిమిషంలో స్నిడెర్ (డచ్) ఇచ్చిన బంతిని రాబెన్ అర్జెంటీనా పెనాల్టీ నుంచి గోల్ పోస్ట్
 లోకి పంపాడు. కానీ ఈ వింగర్ షాట్‌ను జేవియర్ మస్కరెనో సమర్థంగా కట్టడి చేశాడు.
 
 ఎక్స్‌ట్రా టైమ్ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా రొడ్రిగో పలాసియో (అర్జెంటీనా) కొట్టిన హెడర్‌ను సిల్లెసన్ సమర్థంగా నిలువరించాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement