'వరల్డ్ కప్' పై వారంలో నిర్ణయం: పీసీబీ
న్యూఢిల్లీ: వచ్చే నెలలో భారత్ లో ఆరంభం కానున్న వరల్డ్ టీ 20 టోర్నీలో పాకిస్తాన్ క్రికెట్ పాల్గొనే అంశంపై వారంలో స్పష్టత రానుంది. దీనికి సంబంధించి వారంలో తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తెలిపింది. ఈ నిర్ణయం అనంతరం మాత్రమే తాము ఒక స్పష్టతకు రాగలమని లు పీసీబీ మీడియా డైరెక్టర్ అంజాద్ హుస్సేన్ గురువారం తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
భారత దేశంలో క్రికెట్ ఆడటానికి ఏ దేశం కూడా భయపడాల్సిన అవసరం లేదని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎవరికైనా భారత్‌లో ఆడటం ఇష్టం లేకపోతే ఐసీసీకి నిర్ణయం తెలపొచ్చని, తాము మాత్రం అందరికీ పటిష్టమైన భద్రత కల్పిస్తామని ఠాకూర్ తెలిపిన నేపథ్యంలో పీసీబీ స్పందించింది. ఒక వారంలో వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించి తుది నిర్ణయం చెబుతామని పేర్కొంది.
భారత్ లో జరిగే టీ 20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పాల్గొనడానికి సంశయం వ్యక్తం చేస్తోంది. తమ జట్టు భారత్ లో పర్యటిస్తే దాడులకు గురయ్యే అవకాశం ఉందని భావిస్తున్న పీసీబీ.. అదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దృష్టికి ఇటీవల తీసుకెళ్లింది. తమ క్రికెట్ జట్టు భారత్ లో పర్యటించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే అవకాశాలు తక్కువగా ఉందనే విషయాన్ని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ ప్రస్తావించారు. దీంతో వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పాల్గొనే అంశంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.