66 ఏళ్ల తర్వాత...
రంజీ ట్రోఫీ ఫైనల్లో గుజరాత్
సెమీస్‌లో జార్ఖండ్ అనూహ్య పరాజయం
నాగపూర్: రంజీ ట్రోఫీలో గుజరాత్ జట్టు చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. 83 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఆ జట్టు రెండోసారి రంజీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. బుధవారం ఇక్కడ ముగిసిన సెమీ ఫైనల్లో గుజరాత్ 123 పరుగుల తేడాతో జార్ఖండ్‌ను చిత్తు చేసింది. సెమీస్‌లో 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 41 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. కౌశల్ సింగ్ (24)దే అత్యధిక స్కోరు. గుజరాత్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (6/29) ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగా, ఆర్పీ సింగ్‌కు 3 వికెట్లు దక్కాయి. 1950–51 సీజన్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరిన గుజరాత్, నాడు హోల్కర్ జట్టు చేతిలో పరాజయం పాలైంది.
ఆదుకున్న జునేజా...
గుజరాత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 100/4తో నాలుగో రోజు ఆట కొనసాగించిన గుజరాత్ 37 పరుగులు జోడించిన అనంతరం మరో 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో మన్‌ప్రీత్ జునేజా (125 బంతుల్లో 81; 12 ఫోర్లు) జట్టును ఆదుకున్నాడు. చిరాగ్ గాంధీ (105 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలసి ఏడో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. 69 పరుగులకు 5 వికెట్లు తీసిన జార్ఖండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ ఈ సీజన్‌లో తన వికెట్ల సంఖ్యను 56కు పెంచుకొని రంజీ టాపర్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌కు కష్టసాధ్యంగా మారిన పిచ్‌పై 235 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జార్ఖండ్ ఆరంభం నుంచే తడబడింది. తన తొలి స్పెల్‌లో వేసిన ఐదు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వని ఆర్పీ సింగ్, మరో ఎండ్ నుంచి బుమ్రా ప్రత్యర్థిని కట్టి పడేశారు.
ముంబై లక్ష్యం 251
రాజ్‌కోట్: బాబా ఇంద్రజిత్ (169 బంతుల్లో 138; 13 ఫోర్లు, 1 సిక్స్), అభినవ్ ముకుంద్ (186 బంతుల్లో 122; 11 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో రెండో సెమీఫైనల్లో తమిళనాడు జట్టు ముంబైకి సవాల్ విసిరింది. మ్యాచ్ నాలుగో రోజు బుధవారం తమ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 356 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన తమిళనాడు... ముంబై ముందు 251 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయిన తమిళనాడు, ‘డ్రా’ వల్ల లాభం లేదని భావించి ప్రత్యర్థికి చివరి రోజు లక్ష్యాన్ని ఛేదించే అవకాశం కల్పించింది. అనంతరం ముంబై ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 5 పరుగులు చేసింది.