నన్ను కార్నర్ చేస్తున్నారు : టీమిండియా క్రికెటర్
న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరగనున్న టెస్టు సిరీస్‌లో భారత జట్టులో చోటు కల్పించకపోవడంపై నిరాశచెందినట్లు గౌతం గంభీర్ తెలిపాడు. ఈ విషయంపై మరిన్ని విషయాలను ట్వీట్ చేశాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఆడిన జట్టు నుంచి ఇద్దరిని తప్పించి 15 మంది సభ్యులతో సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించగా, గౌతం గంభీర్ కు మాత్రం పిలుపు అందకపోవడం గమనార్హం.
'నేను చాలా నిరాశచెందాను కానీ ఓడిపోలేదు. నన్ను కార్నర్ చేస్తున్నారు. జట్టులో స్థానం కోసం ఎప్పుడూ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను. సిరీస్ కు ఎంపికైన భారత జట్టుకు శుభాకాంక్షలు' అని గంభీర్ ట్వీట్ చేశాడు. గంభీర్ జట్టులో స్థానం కోల్పోయి రెండేళ్లు గడిచిపోయింది. అయినా అతడికి అవకాశం మాత్రం దొరకడం లేదు.
చివరగా 2014లో ఇంగ్లండ్ తో సిరీస్ ఆడాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో వరుస హాఫ్ సెంచరీలతో రాణిస్తోన్న గంభీర్ తనకు మళ్లీ పిలుపు అందుతుందని భావించగా నిరాశే ఎదురైంది. సాధారణ ప్రదర్శన చేస్తున్న రోహిత్ శర్మ, ఫామ్ లో లేని మరో ఓపెనర్ శిఖర్ ధావన్ లపై మాత్రం సెలక్టర్లు నమ్మకముంచారు.
I'm disappointed but not defeated; I'm cornered but not a coward. Grit my partner, courage my pride...for, I must fight, I must fight...
— Gautam Gambhir (@GautamGambhir) 12 September 2016