టీమిండియాదే గెలుపు
మిర్పూర్: ఆసియాకప్లో పాకిస్తాన్తో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్ విసిరిన పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ధోని సేన చెమటోడ్చి ఛేదించింది . అటు విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్లు సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో భారత్ మరుపురాని విజయాన్ని అందుకుంది. ట్వంటీ 20ల్లో పాక్పై ఉన్న రికార్డును మరింత మెరుగుపరుచుకున్న భారత్.. ఈ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
భారత్ విజయలక్ష్యం 84. ఇక ధోని సేన విజయం నల్లేరు నడకే అనుకున్నారు అంతా. అయితే ఎనిమిది పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది భారత్. రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు డకౌట్గా పెవిలియన్ కు చేరగా, సురేష్ రైనా(1) వెంటనే అవుటయ్యాడు. దీంతో మ్యాచ్ పాకిస్తాన్ పై మొగ్గింది. ఆ తరుణంలో విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్లు పాకిస్తాన్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొని నిలబడ్డారు. విరాట్(49; 51 బంతుల్లో 7 ఫోర్లు) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోగా, యువరాజ్ సింగ్(14 నాటౌట్; 32 బంతుల్లో 2 ఫోర్లు) మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు. ఈ జోడీ నాల్గో వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియా 15.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ అమిర్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా, మహ్మద్ సమీకి రెండు వికెట్లు లభించాయి.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 17.3 ఓవర్లలో 83 పరుగులకే చాపచుట్టేసింది.పాకిస్తాన్ పేకమేడలా కుప్పకూలింది. భారత్ పదునైన బౌలింగ్కు కట్టుదిట్టమైన ఫీల్డింగ్ తోడవడంతో పాక్ ఇంకా 15 బంతులుండగానే మూటగట్టేసింది. పాకిస్తాన్ ఆటగాళ్లలో మహ్మద్ హఫీజ్(4), షలీల్ ఖాన్(7), ఖుర్రామ్ మంజూర్(10),షోయబ్ మాలిక్(4), ఉమర్ అక్మల్(3), ఆఫ్రిది(2), రియాజ్(4)లు తీవ్రంగా నిరాశపరిచారు. సర్ఫరాజ్ అహ్మద్(25) చేసిన పరుగులే పాక్ జట్టులో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించగా, రవీంద్ర జడేజాకు రెండు, నెహ్రా, బూమ్రా, యువరాజ్ సింగ్లు తలో వికెట్ సాధించారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
మ్యాచ్ విశేషాలు..
*భారత ట్వంటీ 20 చరిత్రలో ఓపెనర్లు డకౌట్ గా పెవిలియన్ చేరడం ఇదే తొలిసారి. అయితే పాకిస్తాన్ ప్రత్యర్థి ఓపెనర్లను సున్నా పరుగులకే అవుట్ చేయడం రెండో సారి.
*ఇది పాకిస్తాన్ మూడో అత్యల్ప ట్వంటీ 20 స్కోరు. అంతకుముందు ఆస్ట్రేలియాపై 74, వెస్టిండీస్పై 82 పరుగులకు పాక్ ఆలౌటయ్యింది.
*ట్వంటీ 20 ల్లో మొదటి 10 ఓవర్లలో ఆరు వికెట్లను భారత్ తొలిసారి సాధించింది.