ఇదా మనం ఇచ్చే గౌరవం | indian athlets fasing problom's in rio olympics | Sakshi
Sakshi News home page

ఇదా మనం ఇచ్చే గౌరవం

Published Wed, Aug 10 2016 2:45 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

ఇదా మనం ఇచ్చే గౌరవం

ఇదా మనం ఇచ్చే గౌరవం

రియో ఒలింపిక్ క్రీడా గ్రామం అంతా సందడిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 10 వేలకు పైగా ఆటగాళ్లతో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన అధికారులు తమ ఆటగాళ్లతో రెగ్యులర్‌గా సంభాషిస్తున్నారు. పోటీలపై విశ్లేషణలు ఒక వైపు... మీడియాతో, డాక్టర్లతో, ట్రైనర్లు, థెరపిస్ట్‌లతో మరో వైపు మాట్లాడి ఇతర సమస్యలు ఉన్నాయేమో, ఇంకా ఏమైనా కావాలా అంటూ పదే పదే అడిగి జాగ్రత్త పడుతున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.

 ఇదే సమయంలో భారత అధికారులు కూడా ఆ పరిసరాల్లోనే ఉన్నారు. ఆటగాళ్లతో చర్చించడం సంగతి దేవుడెరుగు... ఒక్కొక్కరు ఒక్కో స్టాల్ వద్ద కనిపించారు. ఎక్కడ ఏం దొరుకుతుంది? ఏ గిఫ్ట్ ధర ఎంత? ఇంట్లో ఎవరి కోసం ఎన్ని తీసుకుపోవచ్చు... ఇదీ వారు అక్కడ చేస్తున్న పని. పైగా స్వయంగా భారత జట్టుకు నేతృత్వం వహిస్తున్న చెఫ్ డి మిషన్ నుంచి కూడా ‘ఇంకేం పతకాలు వస్తాయిలే’ అన్న నిట్టూర్పు ఒకటి. సరదా కోసం ఒలింపిక్స్‌కు వెళ్లేవారు కూడా ఆటగాళ్లను తక్కువ చేయడం మన దేశంలోనే సాధ్యమేమో.

‘రియోకు వెళ్లడం, సెల్ఫీలు దిగడం, ఉత్త చేతులతో తిరిగి రావడమే భారత ఆటగాళ్ల లక్ష్యం. డబ్బు, అవకాశం రెండూ వృథా...’ పాతతరం జర్నలిస్ట్, రచయిత్రి శోభా డే మన అథ్లెట్ల గురించి చేసిన తీవ్ర వ్యాఖ్య ఇది. సెక్స్, అమ్మాయిల ఒంపుసొంపులు, అక్రమ సంబంధాలు గురించే దశాబ్దాలుగా రాస్తూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తికి కూడా దేశం కోసం ఆడే ఆటగాళ్లంటే చులకన భావం. ప్రపంచం మొత్తంతో పోటీ పడుతూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆటగాళ్ల కష్టం గురించి ఆమెకేం తెలుసు. నేరుగా బయటకు చెప్పకపోయినా, మన దేశంలో చాలా మంది, ముఖ్యంగా అధికారుల ఆలోచనా ధోరణి ఇలాగే సాగుతోంది. పతకాలు రావట్లేదు అంటూ గోల చేయడమే తప్ప మనం అథ్లెట్లకు ఇస్తున్న విలువేమిటో ఎప్పుడైనా గుర్తించారా? నిజంగా ఆటగాళ్లను గౌరవించేవాళ్లే అయితే ఒలింపిక్ అథ్లెట్‌కు సాధారణ తరగతి టికెట్ ఇచ్చి, తాము బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తారా... మన భారత అధికారులు ఇలాంటి నిర్వాకమే చేసి చూపించారు.

36 గంటల వేదన
పీటీ ఉషలాంటి దిగ్గజం తర్వాత 36 ఏళ్లకు  భారత్ తరఫున ఒలింపిక్స్ 100 మీ. పరుగులో అర్హత సాధించిన అథ్లెట్ ద్యుతీచంద్. అనూహ్య వివాదంలో బాధితురాలిగా మారి, తీవ్రమైన సంఘర్షణ తర్వాత ఆమె తిరిగి ట్రాక్‌లోకి అడుగు పెట్టడమే ఒక అద్భుతం. దానికి తన శ్రమ, పట్టుదలను జోడించి ఆమె ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయింది. ఆమె పతకం గెలుస్తుందా, లేదా అనేది తర్వాతి సంగతి. కానీ దాని కోసం తగిన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనకు లేదా?  హైదరాబాద్‌నుంచి రియోకు 36 గంటల ప్రయాణం. అందుకు ద్యుతీ మూడు ఫ్లయిట్‌లు మారాల్సి ఉంది. అయితే మన అధికారులు ఆమెకు ఈ మూడు సార్లు ఎకానమీ క్లాస్ టికెట్ ఇచ్చారు. వెంట రావాల్సిన కోచ్ నాగపురి రమేశ్‌ను పంపలేదు.

ఆయన తర్వాత విడిగా వెళ్లారు. 36 గంటల పాటు ద్యుతీ సరిగా నిద్రపోలేదు, తగిన విశ్రాంతి కూడా లభించలేదు. అయితే అన్నింటికంటే దుర్మార్గం ఆమెతో పాటు అదే ఫ్లయిట్‌లో ప్రయాణించిన మన అధికారులు మాత్రం బిజినెస్ క్లాస్‌లో హాయిగా కునుకు తీశారు. పాపం... ఒలింపిక్స్ కోసం వారు పడుతున్న కష్టానికి ఇంతటి సౌఖ్యం తప్పని సరేమో. దాంతో తన బాధను దాచుకోలేక ద్యుతీ బయట పడింది. ‘ఆటగాళ్ల మంచి చెడు చూసుకోవాల్సినవారు ఇలా చేస్తారా. దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సినవారు ఎకానమీలో వెళితే, అధికారులు బిజినెస్ క్లాస్‌లో వెళతారా. ఇలా అయితే ఏం ప్రదర్శన ఇవ్వగలం. ఒలింపియన్లకు ఇక ముందైనా ఇలాంటి సమస్య రాకూడదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

మాటల తూటాలు
ఒలింపిక్స్‌లో చెఫ్ డి మిషన్ అంటే దేశ బృందం మొత్తానికి పెద్దన్నలాంటి మనిషి. ఏమైనా సమస్యలు ఉంటే నేనున్నానంటూ ముందుకొచ్చి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయడం, వ్యతిరేక పరిస్థితులు ఉన్నా ఫర్వాలేదంటూ వెన్ను తట్టి భరోసా ఇవ్వడం ఆయన పని. కానీ మన చెఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తాకు మూడు రోజులకే అసహనం వచ్చేసినట్లుంది. కొన్ని ఈవెంట్లు కూడా పూర్తిగా ముగియక ముందే ఆయన అథ్లెట్ల స్ఫూర్తిని దెబ్బ తీసే వ్యాఖ్యలు చేశారు. ‘ఇక్కడికి రాక ముందు 10 పతకాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు అది అసాధ్యంగా కనిపిస్తోంది.

లండన్ తరహాలో ఆరు మెడల్స్ రావడం కూడా కష్టమే. చాలా నిరాశగా ఉంది’ అంటూ అప్పుడే ఆయన మొత్తం జాతకం చెప్పేశారు. ఇది రియోలో మన అథ్లెట్లపై ఎలాంటి తప్పుడు ప్రభావం చూపిస్తుందనే విషయం ఆయనకు ఏ మాత్రం తట్టలేదు. ఇక పోటీలకు ముందు కూడా ఒక అధికారి ఇలాగే అథ్లెట్‌ను అవమానించాడు. షాట్‌పుట్‌లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు దక్కించుకున్న మన్‌ప్రీత్ కౌర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనతో పాటు కోచ్‌ను పంపాలని ఆమె విజ్ఞప్తి చేస్తే... ‘నువ్వు ఎలాగూ మెడల్ గెలవలేవు. కాబట్టి కోచ్‌ను పంపడంలో అర్థం లేదు’ అనడంతో ఆమె నివ్వెరపోయింది. 

పతకం గెలిస్తేనే గొప్పా..?
దీపా కర్మాకర్ ఫైనల్ చేరిందనగానే దేశం యావత్తూ సంతోష పడింది. ఆమె పతకం కూడా గెలవాలని అంతా కోరుకుంటున్నారు. ఒక వేళ మెడల్ సాధించకపోతే ఆమె ఓడిపోయినట్లేనా... ఎక్కడో త్రిపురనుంచి ఒలింపిక్స్ వరకు వెళ్లగలిన ఆమె ప్రస్థానమే ఒక పెద్ద విజయం. ఎలాంటి సౌకర్యాలు లేని చోట కేవలం తన ప్రతిభ, శ్రమను నమ్ముకొని ఆమె ఈ స్థాయికి చేరింది. ప్రెషర్ కుక్కర్‌లాగే తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ చదువులు సాగించే పిల్లలు, వారిని ఆటల్లో చేర్చాలంటే సందేహించే తల్లిదండ్రులు ఉన్న మన దేశంలో దీప సాధించిన ఘనత మూడు స్వర్ణాలతో సమానం అంటే అతిశయోక్తి కాదు. ‘బరిలోకి దిగక ముందే నేను ఓడిపోతానని చెప్పడం దుర్మార్గం. ఇంట్లో పసి పాపను వదిలి రియో వెళ్లేది కేవలం పాల్గొనడం కోసమా. నేను గెలుపు కోసం 110 శాతం కష్ట పడతా’ అని మన్‌ప్రీత్ ఉద్వేగంగా చెప్పిన మాటలు మనల్ని ఆలోచనలో పడేస్తాయి.

అథ్లెట్లను గౌరవిద్దాం
ఒక ఆటగాడు ఒలింపిక్స్ స్థాయికి చేరడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.   జీవిత కాల శ్రమ, పట్టుదల, పోరాటమే కాదు లెక్క లేనన్ని త్యాగాలు, అవమానాలు కూడా వాటిలో భాగమే. ఇక అమ్మాయిల విషయం అయితే చెప్పనవసరం లేదు. మన దేశంలో అధికారుల అవినీతి, వ్యవహార శైలి కూడా ఆటగాళ్లను వెనక్కి లాగుతుంటాయి. సొంత ప్రయోజనాల కోసం సత్తా లేని వారిని కూడా ముందు వరుసలో నిలబట్టే వీరికి అసలు ఆటగాళ్లంటే మాత్రం లెక్కలేనితనం. ఒలింపిక్స్ విలేజ్‌లో తమ ప్రత్యర్థులతో మాట్లాడినప్పుడు వారికి ఉన్న సౌకర్యాలు, టెక్నాలజీతో పోల్చి చూసినప్పుడు మన భారత ఆటగాళ్ల మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయో ఊహించాల్సిన పని లేదు.

బాగా డబ్బు ఖర్చు చేస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం అంటూ ప్రభుత్వం ఎన్ని ప్రకటనలైనా చేయవచ్చు గాక... కానీ క్రీడాకారుడిని గౌరవించలేని దేశంలో పతకాలు ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. అభిమానులుగా మనం అంచనాలు పెంచుకోవడంలో తప్పు లేదు. కానీ మెడల్ సాధించలేకపోయినా మనోళ్లకు అండగా నిలవాలి తప్ప... వారి ఇన్నేళ్ల కష్టాన్ని, శ్రమను తక్కువ చేసి అవమానించాల్సిన అవసరం లేదు. ‘నీలాంటివారు మారినప్పుడే ప్రజల ఆలోచనా ధోరణి కూడా మారుతుంది’ అంటూ జ్వాల... ‘ఒక్కసారి 60 నిమిషాలు హాకీ మైదానంలో పరుగెత్తి, బింద్రా రైఫిల్ మోసి చూడు, ఆ కష్టం ఏమిటో తెలుస్తుంది’ అంటూ వీరేన్ రస్కిన్హా ... శోభాడేకి ఇచ్చిన జవాబులు చాలా మంది విమర్శకులకు చెంపపెట్టు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement