న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ అభిమానులకు ఆనందాన్నిచ్చే వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో ఐపీఎల్ నిర్వహించడమే తనకు మొట్టమొదటి ప్రాధాన్యతాంశమని అన్నాడు. ఐపీఎల్ లేకుండా 2020 ముగిసిపోవడం ఏమాత్రం ఇష్టం లేదన్న ‘దాదా’... ఏమాత్రం అవకాశం దొరికినా సరైన భద్రతా చర్యలు తీసుకుంటూ లీగ్‌ను నిర్వహిస్తామని హామీ ఇచ్చాడు. ఐపీఎల్‌కు సంబంధించి తాము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు ఐసీసీ టి20 వరల్డ్‌కప్ భవితవ్యంపై ప్రకటన చేయాల్సి ఉంటుందని అన్నాడు. బుధవారం తన 48వ పుట్టినరోజు జరుపుకున్న ‘దాదా’ ఇంకా ఏమన్నాడంటే...
► మా తొలి ప్రాధాన్యత భారత్‌లో ఐపీఎల్ నిర్వహించడమే. 35–40 రోజులు దొరికినా చాలు టోర్నీ జరుపుతాం. కానీ వేదిక గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను.
► మొదట ఐపీఎల్ విండో దొరుకుతుందో లేదో చూడాలి. ఆ తర్వాత భారత్‌లో పరిస్థితులు అనకూలించకపోతే ఏ దేశానికి లీగ్‌ను తరలించాలో ఆలోచించాలి. విదేశాల్లో అయితే ఫ్రాంచైజీలకు, బోర్డులకు వ్యయభారం ఎక్కువవుతుంది.
► పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో తటస్థ వేదిక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్ టి20 టోర్నమెంట్ రద్దయింది.
► టి20 ప్రపంచకప్‌పై మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. కానీ ఐసీసీ అధికారికంగా చెప్పేవరకు అసలేం జరుగనుందనే దానిపై ఒక నిర్ణయానికి రాలేం. నా వ్యక్తిగత అంచనా ప్రకారమైతే ఈ ఏడాది టి20 ప్రపంచకప్ జరిగేది అనుమానమే.
► ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలలో కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో అక్కడ లీగ్ జరుగుతుందని చెప్పలేను. అహ్మదాబాద్‌పై ప్రస్తుతం మా దృష్టి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడే నిర్వహిస్తామని కచ్చితంగా అయితే చెప్పలేను.
► కరోనా విరామం తర్వాత భారత్ ఆడబోయే తొలి అంతర్జాతీయ సిరీస్ ఏదో చెప్పలేను. భారత క్రికెటర్ల ఆరోగ్యమే మా తొలి ప్రాధాన్యత. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకునేది లేదు.
ఐపీఎల్ లేకుండా 2020 ముగిసిపోవద్దు
Published Thu, Jul 9 2020 5:23 AM | Last Updated on Thu, Jul 9 2020 5:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment