అతడే ఒక ‘సైన్యం’
మధ్య అమెరికాలో కేవలం 45 లక్షల జనాభా ఉన్న దేశం కోస్టారికా. రక్షణ కోసం సైన్యం లేకపోవడం ఈ దేశం ప్రత్యేకత. ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో ఆ దేశ గోల్‌కీపర్ నవాస్ చూపించిన తెగువ చూస్తే... ఈ దేశానికి సైన్యం అవసరం లేదేమో అనిపిస్తుంది. మ్యాచ్ ఆద్యంతం అద్భుతంగా గ్రీస్ స్ట్రయికర్స్‌ను అడ్డుకున్న నవాస్... పెనాల్టీ షూటౌట్‌లోనూ ప్రత్యర్థి కిక్‌ను అడ్డుకుని కోస్టారికాను తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌కు చేర్చాడు.
- కోస్టారికాను క్వార్టర్స్‌కు చేర్చిన నవాస్
- పెనాల్టీ షూటౌట్‌లో గ్రీస్‌పై గెలుపు
రెసిఫె: ఫుట్‌బాల్ ప్రపంచకప్ నాకౌట్ దశలో మరో ఫలితం పెనాల్టీ షూటౌట్ ద్వారానే తేలింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో 5-3 తేడాతో కోస్టారికా జట్టు గ్రీస్‌ను ఓడించింది. తద్వారా ఈ మెగా టోర్నీలో తొలిసారిగా ఈ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. అలాగే ప్రి క్వార్టర్స్ దశలో రెండు మ్యాచ్ ల్లో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం రావడం ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి. బ్రెజిల్, చిలీ జట్ల మధ్య ఫలితం కూడా ఇలాగే రావడం తెలిసిందే.
అంతకుముందు మ్యాచ్ నిర్ణీత సమయంలో రెండు జట్లు 1-1 స్కోరుతో సమంగా నిలిచాయి. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన కోస్టారికా ఇంజ్యూరీ సమయం (90+1)లో గ్రీస్‌కు గోల్‌ను సమర్పించుకుంది. దీంతో ఎక్స్‌ట్రా సమయం అనివార్యమైంది. ఇక్కడా ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లింది. ఇందులో కోస్టారికా తరఫున బోర్జెస్, రూయిజ్, గోంజలెజ్, క్యాంప్‌బెల్, ఉమానా గురి తప్పకుండా గోల్స్ సాధించారు.
ఇక గ్రీస్ తరఫున మిట్రోగ్లూ, లేజరస్, కోలెవస్ వరుసగా గోల్స్ చేయగా కీలకమైన తరుణంలో గేకాస్ షాట్‌ను గోల్ కీపర్ నవాస్ అడ్డుకున్నాడు. దీంతో పరాజయం ఖాయమైంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కోస్టారికా గోల్ కీపర్ నవాస్‌కు దక్కింది. క్వార్టర్స్‌లో ఈనెల 5న కోస్టారికా.. నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది.
- తొలిసారిగా నాకౌట్ దశలో ఆడిన గ్రీస్ ప్రారంభంలో కాస్త పైచేయి సాధించింది. 37వ నిమిషంలో స్ట్రయికర్ దిమిత్రియోస్ సల్పింగిడి అతి సమీపం నుంచి కొట్టిన షాట్‌ను కోస్టారికా గోల్ కీపర్ కీలర్ నవాస్ గాల్లో రెండు కాళ్లు చాపుతూ అద్భుతంగా అడ్డుకున్నాడు.
- ఇప్పటిదాకా ప్రపంచకప్‌లో కోస్టారికా సాధించిన 16 గోల్స్‌లో 12 ద్వితీయార్ధంలోనే వచ్చాయి. ఈ ఆనవాయితీ కొనసాగింపుగా అన్నట్టు 52వ నిమిషంలో కోస్టారికా తమ గోల్ ఖాతాను తె రిచింది.
- డిఫెన్స్‌ను ఛేదిస్తూ క్రిస్టియన్ బొలనాస్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న స్ట్రయికర్ బ్రియాన్ రూయిజ్ ఎడమ కాలితో నేర్పుగా గోల్ పోస్టు కుడివైపు చివరకు నెట్టి జట్టును ఆనందంలో నింపాడు.
- 66వ నిమిషంలో కోస్టారికా ఆటగాడు ఆస్కార్ డుయర్టెకు రెండో సారి ఎల్లో కార్డు చూపడంతో మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో ఈ జట్టు పది మందితోనే ఆడాల్సి వచ్చింది.
- చివర్లో గ్రీస్ తమ గోల్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో ఇంజ్యూరీ సమయం ప్రారంభమైన నిమిషానికే కోస్టారికాకు షాక్ తగిలింది. ముందుగా గెకాస్ కొట్టిన షాట్ కీపర్ నవాస్‌కు తగిలి వెనక్కి వచ్చింది. గోల్ పోస్టుకు ఎదురుగా ఉన్న సోక్రటీస్ దీన్ని మెరుపు వేగంతో అందుకుని నెట్‌లోకి పంపాడు. దీంతో అప్పటిదాకా సంబరాల్లో మునిగిన కోస్టారికా అభిమానులు ఒక్కసారిగా నిరాశ కు గురయ్యారు.
- ఎక్స్‌ట్రా సమయంలోనూ గ్రీస్ ప్రయత్నాలను కీపర్ నవాస్ వమ్ము చేసి మ్యాచ్‌ను షూటౌట్‌కు తీసుకెళ్లాడు. షూటౌట్‌లో తమ జట్టే గెలవడంతో ఆటగాళ్లతో పాటు కోస్టారికా అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది.