
మెకల్లమ్ మెరుపులు
134 బంతుల్లో 195 పరుగులు
శ్రీలంకతో తొలి టెస్టు
క్రైస్ట్‌చర్చ్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ ప్రకంపనలు సృష్టించాడు. శుక్రవారం స్థానిక హాగ్లే ఓవల్ మైదానంలో తను లంక బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 134 బంతుల్లోనే 195 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. ఇందులో 18 ఫోర్లతో పాటు 11 సిక్స్‌లు ఉండడం విశేషం. అయితే టెస్టుల్లో అత్యంత వేగంగా డబుల్ సాధించిన రికార్డును తృటిలో కోల్పోయాడు. తన దేశానికే చెందిన నాథన్ ఆస్టల్ (153 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉంది. మరోవైపు మెకల్లమ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో కివీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఏకంగా ఏడు వికెట్లకు 80.3 ఓవర్లలో 429 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ప్రారంభంలో బౌలర్లకు అనుకూలించిన ఈ పిచ్‌పై కెప్టెన్ మెకల్లమ్ అద్వితీయ ఆటతీరును ప్రదర్శించాడు. 88 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన తను... కేన్ విలియమ్సన్ (98 బంతుల్లో 54; 7 ఫోర్లు), జిమ్మీ నీషమ్ (80 బంతుల్లో 85; 10 ఫోర్లు; 3 సిక్సర్లు)తో కలిసి సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇందులో నీషమ్‌తో కలిసి 23.8 ఓవర్లలో 7.84 రన్‌రేట్‌తో 153 పరుగులు రాబట్టాడు. ఇది టెస్టుల్లో వేగవంతమైన మూడో 150+ భాగస్వామ్యం.
లక్మల్ వేసిన ఇన్నింగ్స్ 55వ ఓవర్‌లో చెలరేగిన మెకల్లమ్ 4,6,6,4,6తో 26 పరుగులు పిండుకున్నాడు. 74 బంతుల్లోనే 11వ సెంచరీ చేసిన తను గత నెలలో పాక్‌తో జరిగిన షార్జా టెస్టులో 78 బంతుల్లో సెంచరీ రికార్డును (కివీస్ తరఫున) అధిగమించాడు. 103 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు. అయితే 153 పరుగుల వద్ద ఉన్నప్పుడు లాంగ్ ఆన్‌లో మెకల్లమ్ ఇచ్చిన క్యాచ్‌ను సంగక్కర వదిలేశాడు. 65.5 ఓవర్ల దగ్గర ఈ సునామీ ఇన్నింగ్స్ ముగిసింది. చివరి ఓవర్‌కు కొత్త బంతిని తీసుకున్న లంక అదే ఓవర్‌లో వికెట్ తీసి తొలి రోజును ముగించింది. ఆట నిలిచే సమయానికి మార్క్‌క్రెయిగ్ (19 బంతుల్లో 5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. మాథ్యూస్‌కు రెండు వికెట్లు దక్కాయి.
రికార్డులు
ఒక రోజులో 429 పరుగులు చేయడం కివీస్‌కిదే తొలిసారి.
ఓ క్యాలెండర్ ఏడాదిలో టెస్టుల్లో అత్యధిక సిక్స్ (9 మ్యాచ్‌ల్లో 33)లు కొట్టిన బ్యాట్స్‌మన్ మెకల్లమ్.
టెస్టుల్లో అత్యంత వేగంగా (74 బంతుల్లో) సెంచరీ చేసిన తొలి కివీస్ బ్యాట్స్‌మన్.
ఓ ఏడాదిలో 1000కి పైగా పరుగులు చేసిన తొలి కివీస్ బ్యాట్స్‌మన్‌గా రికార్డు.
కివీస్ తరఫున ఒక ఓవర్‌లో అత్యధిక పరుగుల (26) రికార్డు సమం.
ఓవరాల్‌గా ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్ (11)లు కొట్టిన రెండో బ్యాట్స్‌మన్. వసీం అక్రమ్ (12) ముందున్నాడు.
ఈ ఏడాది మెకల్లమ్ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు.
బాక్సింగ్ డే టెస్టుకి న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వడం 11 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
క్రైస్ట్‌చర్చ్‌లో ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న తొలి టెస్టు ఇది.