కోమాలోంచి బయటకు షుమాకర్
లియోన్: ఆరు నెలల పాటు కోమాలో ఉన్న ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఎట్టకేలకు బయటపడ్డాడు. దీంతో ఇప్పటిదాకా చికిత్స పొందుతున్న ఫ్రాన్స్‌లోని ఆస్పత్రి నుంచి అతడిని సోమవారం స్విట్జర్లాండ్‌లో లుసానేలోని ఆస్పత్రికి తదుపరి చికిత్స కోసం తరలించారు. ఈ విషయాన్ని షుమాకర్ తరపు ప్రతినిధి సబినే కెమ్ అధికారికంగా ప్రకటించారు. భార్య, పిల్లలతో కలిసి షుమాకర్ స్విట్జర్లాండ్‌లోనే ఓ చిన్న పట్టణంలో నివాసం ఉంటున్నాడు. గత ఏడాది డిసెంబర్ 29న ఫ్రాన్స్‌లోని మెరిబెల్‌లో 45 ఏళ్ల షుమాకర్ స్కీయింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి గ్రెనోబుల్‌లో అతనికి చికిత్సనందించిన డాక్టర్లు.. మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు రెండు శస్త్రచికిత్సలు చేశారు. షుమాకర్‌లో కదలికలు కనిపించినట్లు పలుమార్లు వార్తలు రాగా, అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించేందుకు ఆసక్తి చూపలేదు. అయితే అతడు తప్పక కోలుకుంటాడన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తూ వచ్చారు. సోమవారం షుమాకర్ తరలింపు సందర్భంగా మీడియా దృష్టంతా గ్రెనోబుల్ పైనే ఉన్నా.. ఎటువంటి హడావిడి లేకుండా, మీడియా సమావేశం కూడా నిర్వహించకుండా అతడిని తీసుకెళ్లారు.
అయితే గాయపడిన నాటి నుంచి షుమాకర్‌కు చికిత్సనందించిన వైద్యులకు, అతడు కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ అతని కుటుంబసభ్యులు కృతజ్ఞతలు చెప్పినట్లు సబినే కెమ్ తెలిపారు. షుమాకర్ ప్రస్తుత ఆరోగ్యస్థితిపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆమె నిరాకరించారు. పూర్తిగా కోలుకునే దాకా ప్రపంచానికి దూరంగా ఉంచనున్నట్లు చెప్పారు.