
ముగ్గురే గెలిచారు
ఐదుగురు మాజీ క్రీడాకారులకు నిరాశ
అజహర్, కైఫ్‌లకూ తప్పని ఓటమి
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో క్రీడా ప్రముఖులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఏథెన్స్ ఒలింపిక్ మెడలిస్ట్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, మాజీ క్రికెటర్ కీర్తి అజాద్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించగా... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసిన రాథోడ్ జైపూర్(రూరల్) నుంచి 3.32 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ కురువృద్ఢుడు సీపీ జోషిపై విజయ దుందుభి మోగించారు.
అర్మీలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన రాథోడ్ గత సెప్టెంబర్‌లో బీజేపీలో చేరి తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించారు. నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వంలో రాజ్యవర్ధన్‌కు క్రీడల మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ‘జైపూర్(రూరల్) నియోజకవర్గానికి సేవలందించడమే నా తొలి ప్రాధాన్యం. మా కెప్టెన్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఏ బాధ్యతనైనా స్వీకరించేందుకు నేను సిద్ధం’ అని రాథోడ్ ప్రకటించారు. ఇక మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫూల్‌పూర్ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యాడు.