
కోల్‌కతా: టీమిండియా ప్రధాన పేసర్ మొహమ్మద్ షమీకి అమెరికా వీసా తిరస్కరణ... అనుమతి పరిణామాలు వెంటవెంటనే జరిగిపోయాయి. గతేడాది కుటుంబ వివాదాలతో షమీ మాజీ భార్య హసీన్ జహాన్ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో అతడిపై వరకట్న, లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వీటికి సంబంధించి పోలీసు తనిఖీ రికార్డులు అసంపూర్తిగా ఉండటంతో షమీ వీసాను ముంబైలోని అమెరికా ఎంబసీ ప్రాథమికంగా పక్కన పెట్టింది.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీఈవో రాహుల్ జోహ్రి... ఆటగాడిగా షమీ ఘనతలు, కేసుకు సంబంధించిన పూర్తిస్థాయి పోలీస్ రిపోర్ట్‌ను జతచేస్తూ అమెరికా ఎంబసీకి లేఖ రాశారు. దీంతో షమీకి మార్గం సుగమమైంది. భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు ఈ నెల 29న ముంబై నుంచి బయల్దేరనుంది. ఆగస్టు 3, 4 తేదీల్లో రెండు టి20లను అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్స్‌లో ఆడుతుంది. వాస్తవానికి షమీ టి20 జట్టులో లేడు. వన్డేలు, టెస్టులకు మాత్రమే అతడిని ఎంపిక చేశారు. అయితే, చివరి టెస్టు ముగిశాక... టీమిండియా అమెరికా మీదుగానే స్వదేశానికి వస్తుంది. దీంతో ఆ దేశ వీసా పొందడం అవసరమైంది.
Comments
Please login to add a commentAdd a comment