
కొలంబో:తమ నుంచి విజయాన్ని దూరం చేసిన బంగ్లాదేశ్ ఆటగాడు ముష్పికర్ రహీమ్‌పై శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాము నిర్దేశించిన భారీ లక్ష్యాన్నిఛేదించే క్రమంలో ముష్పికర్ ఆడిన తీరు నిజంగా అద్భుతమని కొనియాడాడు. తాను చూసిన ముష్పికర్ ఇన్నింగ్స్‌ల్లో ఇదే అత్యుత్తమం అంటూ చండిమాల్ ప్రశంసించాడు. ' ముష్పికర్ అసాధారణ రీతిలో ఆడాడు. నేను చూసిన ముష్పికర్ ఇన్నింగ్స్‌ల్లో ఇదే తొలి స్థానంలో ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడిన ముష్పికర్ మాకు విజయాన్ని దూరం చేశాడు. మిగతా బంగ్లాదేశ్ ఆటగాళ్లు సమయోచితంగా రాణించారు' అని చండిమాల్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌ను మంచి క్రికెట్ గేమ్‌గా అభివర్ణించిన చండిమాల్.. తమ బ్యాటింగ్ తీరు అమోఘంగా ఉందన్నాడు. కాగా, బౌలింగ్ సరిగా చేయకపోవడం వల్లే ఓటమిని చవిచూడాల్సి వచ్చిందన్నాడు.
వచ్చే మ్యాచ్‌లో సత్తాచాటుతామని ఆశాభావం వ్యక్తం చేసిన చండిమాల్.. తదుపరి గేమ్‌లో పక్కా ప్రణాళికల్ని అమలు చేయడంపైనే దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొన్నాడు. ఇక తొలి ఆరు ఓవర్లలోపే స్నిన్నర్ అకిల దనంజయకు బౌలింగ్ ఇవ్వడాన్ని చండిమాల్ సమర్ధించుకున్నాడు. తమ జట్టులో అతనొక స్టార్ బౌలర్ అని, గత కొంతకాలం నుంచి నిలకడగా బౌలింగ్ చేయడం వల్లే ముందుగా బౌలింగ్ ఇచ్చామన్నాడు. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో ముష్పికర్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయంగా 72 పరుగులు సాధించి బంగ్లాదేశ్ సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment