
కరాచీ: యూనిస్‌ఖాన్ తన పీకపై కత్తి పెట్టాడంటూ పాకిస్తాన్ మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ చేసిన ఆరోపణలపై స్పందించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిరాకరించింది. అయితే ఫ్లవర్ ఆరోపించినట్లుగా యూనిస్‌ఖాన్ కోపంతో అతని గొంతుపై కత్తి పెట్టలేదని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘గ్రాంట్ ప్రచారం చేస్తున్నట్లుగా అతన్ని గాయపరచడం యూనిస్‌ఖాన్ ఉద్దేశం కాదు. అందులో నిజం లేదు. యూనిస్ అల్పాహారం తీసుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. అతను బ్రేక్‌ఫాస్ట్ చేస్తోన్న సమయంలో గ్రాంట్ ఏదో చెప్పబోతుండగా... యూనిస్ సరదాగా బటర్ తీసుకునే కత్తితో అతన్ని ఆపాడు. బ్రేక్‌ఫాస్ట్ టేబుల్‌పై ఆట గురించిన సలహాలు ఎందుకు? నన్ను ముందు ప్రశాంతంగా తిననివ్వండంటూ గ్రాంట్‌తో యూనిస్ అన్నాడు’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. గ్రాంట్ ఆరోపణలపై స్పందించేందుకు యూనిస్‌ఖాన్ సుముఖంగా లేడని అన్నారు.