కోల్‌కతా: భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో రంజీ ఫైనల్ ఆడించాలనుకున్న సౌరాష్ట్ర క్రికెట్ సంఘా నికి (ఎస్‌సీఏ) నిరాశ ఎదురైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... జడేజా రంజీ ఫైనల్ ఆడేందుకు అనుమతి నిరాకరించాడు. దేశమే ముందని, ఆ తర్వాతే ఏదైనా టోర్నీలని గంగూలీ తెగేసి చేప్పేశాడు. టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. ఈ నెల 12న ధర్మశాలలో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది.
మరోవైపు సోమవారం నుంచి రాజ్‌కోట్‌లో సౌరాష్ట్ర, బెంగాల్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ జరుగనుంది. కీలకమైన ఫైనల్స్‌లో జడేజాను ఆడించేందుకు ఎస్‌సీఏ అధ్యక్షుడు జయదేవ్ షా బీసీసీఐ చీఫ్ గంగూలీని కోరాడు. కానీ తన అభ్యర్థనను గంగూలీ తిరస్కరించాడని షా చెప్పాడు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జయదేవ్ రంజీ ఫైనల్ ఉన్నప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించరాదన్నాడు. ‘ఐపీఎల్ ఉన్నపుడు బోర్డు అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించదు. ఎందుకంటే లీగ్ ద్వారా బాగా డబ్బు వస్తుంది. రంజీ ట్రోఫీకి ఆదరణ దక్కాలంటే స్టార్ ఆటగాళ్లను ఆడించాల్సిందే. ఆ దిశగా బోర్డు ఆలోచించాలి. రంజీ ఫైనల్ జరిగే రోజుల్లో అంతర్జాతీయ మ్యాచ్ లేకపోతే స్టార్ ఆటగాళ్లందరూ అందుబాటులో ఉంటారు. మ్యాచ్ రసవత్తరంగా జరిగేందుకు అవకాశముంటుంది. ఆదరణ కూడా పెరుగుతుందని జయదేవ్ షా తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment