ధోని భవితవ్యంపై గావస్కర్‌ స్పందన.. | Sunil Gavaskar On MS Dhoni's Comeback Into The Indian Team | Sakshi
Sakshi News home page

ధోని భవితవ్యంపై గావస్కర్‌ స్పందన..

Published Fri, Mar 20 2020 2:00 PM | Last Updated on Fri, Mar 20 2020 2:18 PM

Sunil Gavaskar On MS Dhoni's Comeback Into The Indian Team - Sakshi

న్యూఢిల్లీ:  గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఎంఎస్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత భారత్ ఆడిన ఏ సిరీస్‌కూ అందుబాటులో లేడు. దీంతో ధోని భవితవ్యంపై సందేహాలు తలెత్తాయి. దీంతో పాటు బీసీసీఐ అతడి కాంట్రాక్టును పునరుద్ధరించలేదు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఐపీఎల్‌-13వ సీజన్‌పై పడింది. ఐపీఎల్‌ ప్రదర్శనతో అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ధోనిని చూడాలని అతని అభిమానులు ఎంతగానో భావించారు. ఐపీఎల్ కోసం చెన్నై వచ్చి ప్రాక్టీస్ చేసాడు ధోని. అయితే కరోనా ముప్పుతో ప్రస్తుతం ఐపీఎల్‌ వాయిదా పడింది. పరిస్థితులు మెరుగవ్వకపోతే టోర్నీని రద్దు చేసే అవకాశం  తప్పితే మరొక మార్గం లేదు. ఇది ధోని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 

ఇప్పటికే ధోని రీఎంట్రీ అనేది దాదాపు అసాధ్యమని వీరేంద్ర సెహ్వాగ్‌ స్పష్టం చేయగా, ఇప్పుడు సునీల్‌ గావస్కర్‌ సైతం అదే అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. ఇక భారత క్రికెట్‌ జట్టులో ధోని పునరాగమనం చేయడానికి దారులు మూసుకుపోయాయన్నాడు. ప్రస్తుతం  భారత జట్టుకు ధోని అవసరం లేదనే విషయం స్పష్టంగా కనబడుతుందన్నాడు. ‘గత వన్డే వరల్డ్‌కప్‌లో ధోని చూడటం జరిగింది. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో కూడా ధోనిని చూడాలని నాకు ఉంది. కానీ మళ్లీ అతను టీమిండియా జెర్సీలో కనిపించే అవకాశాలు నాకు తెలిసినంతవరకూ లేవు. భారత క్రికెట్‌ జట్టు ధోనిని దాటుకుని ముందుకు వెళ్లిపోయింది. మరి కొన్ని నెలల్లో ధోని రిటైర్మెంట్‌ ఉంటుందని అనుకుంటున్నా. వేరే వాళ్లలా ధోని రిటైర్మెంట్‌కు పెద్దగా హడావుడి ఉండకపోవచ్చు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండానే ధోని క్రికెట్‌కు వీడ్కోలు చెబుతాడు’ అని గావస్కర్‌ అన్నాడు. (ఇది ధోని రీఎంట్రీకి సంకేతమా?)

ఇదిలా ఉంచితే, గురువారం బీసీసీఐ తన అధికారిక ట్వీటర్‌లో ధోని ఫొటోను షేర్‌ చేసింది. ఎటువంటి సందర్భం లేకుండా సుదీర్ఘ కాలం తర్వాత బీసీసీఐ ఇలా ధోని ఫోటోను పోస్ట్‌ చేయడంతో అతని అభిమానులకు ఊరటనిచ్చింది. తమ మిస్టర్‌ కూల్‌ మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపిస్తాడని ఆశతో ఉన్నారు. దీనిపై స్పష్టత రావాలంటే ఐపీఎల్‌ జరగడం, జరగకపోవడంపై ఆధారపడి వుంటుంది. కొన్ని రోజుల క్రితం సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా సునీల్‌ జోషి పగ్గాలు చేపట్టాడు. ఈ క్రమంలోని ధోని గురించి మదన్‌లాల్‌ నేతృత్వంలోని క్రికెట్‌  అడ్వైజరీ కమిటీ(సీఏసీ).. జోషిని ప్రశ్నించింది. ధోని అంశాన్ని ఎలా స్వీకరిస్తారు అని అడగ్గా, అతన్ని వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌గానే పరిగణలోకి తీసుకుంటామని జోషి బదులిచ్చాడు. ధోని తన పునరాగమనంలో భాగంగా వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా సెలక్షన్‌ కమిటీ పరిగణలోకి తీసుకోవాలంటే టీ20 వరల్డ్‌కప్‌ ముందే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఐపీఎల్‌ ధోనికి మంచి వేదిక అవుతుందని భావించినా అది జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement