
రేపే తుది పోరు!!
ఆస్ట్రేలియన్లంటే చాలు.. ఒంటికాలి మీద లేచే విరాట్ కోహ్లీ పూర్తిస్థాయి నేతృత్వంలో టీమిండియా ఆడబోతున్న తొలి టెస్టు, ఈ సిరీస్లో చిట్ట చివరి టెస్టుకు రంగం సిద్ధమైంది. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో విరాట్ పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ రెండింటిని కోల్పోగా, మూడో టెస్టు డ్రాగా ముగిసింది. చిట్ట చివరిదైన సిడ్నీ టెస్టులో కోహ్లీ తన ఆవేశాన్ని పరుగుల రూపంలోకి మారుస్తాడా.. కనీసం ఈ చిట్టచివరి టెస్టులోనైనా నెగ్గి పరువు నిలబెడతాడా అని భారత అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ప్రియురాలు అనుష్కా శర్మ వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయి సెంచరీల మోత మోగిస్తున్న కోహ్లీ.. మైదానం నుంచే ఆమెకు ఫ్లయింగ్ కిస్సులు కూడా ఇచ్చాడు. ఇప్పుడు జట్టు సభ్యులందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చి, ఇటీవలి కాలంలో పేలవమైన ఫాం చూపిస్తున్న శిఖర్ ధవన్ లాంటివాళ్లతో కూడా మూడంకెల స్కోర్లు నమోదు చేయించగలిగితే.. కోహ్లీ సక్సెస్ అయినట్లే. ధోనీ రాకముందు తాత్కాలికంగా జట్టు బాధ్యత వహించినప్పటి దారి వేరు.. ఇప్పుడు పూర్తి స్థాయి కెప్టెన్గా రంగప్రవేశం చేయడం వేరు. కాబట్టి ఇప్పుడు కోహ్లీని విమర్శకులు కూడా నిశితంగా గమనిస్తుంటారు. అతడి వ్యూహాలు ఎలా పనిచేస్తున్నాయో చూస్తారు. కాబట్టి.. తనను తాను నిరూపించుకోడానికి చక్కటి అవకాశం ఆస్ట్రేలియా మీద చివరి టెస్టు రూపంలో కోహ్లీకి వచ్చింది. ఏం చేస్తాడో చూద్దాం మరి!