భారత్ ప్రత్యర్థి వెస్టిండీస్
►అండర్-19 ప్రపంచకప్
►సెమీస్‌లో బంగ్లాదేశ్‌కు షాక్
►14న ఫైనల్
ఢాకా: అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ జట్టు వెస్టిండీస్‌తో తలపడుతుంది. సొంత గడ్డపై తొలిసారిగా ఈ టైటిల్‌ను సాధించాలనే ఆశతో ఉన్న బంగ్లాదేశ్‌కు వెస్టిండీస్ చేతిలో షాక్ ఎదురైంది. షామర్ స్ప్రింజర్ (2/36), (88 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్) ఆల్‌రౌండ్ షో ప్రదర్శించడంతో గురువారం షేరె బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆతిథ్య జట్టును విండీస్ 3 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ఈనెల 14న జరిగే ఫైనల్లో భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ప్రారంభం నుంచే చెలరేగిన విండీస్ బౌలర్లు 88 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ దశలో మెహదీ హసన్ మిరాజ్ (74 బంతుల్లో 60; 7 ఫోర్లు) క్రీజులో నిలబడి పోరాడాడు. సైఫుద్దీన్ (55 బంతుల్లో 36; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 85 పరుగులు జోడించాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో బంగ్లా స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. కీమో పాల్ మూడు, హోల్డర్ రెండు వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన విండీస్ 48.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 230 పరుగులు చేసి గెలిచింది.తక్కువ స్కోరే అయినా విండీస్ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. తొలి ఓవర్‌లోనే గిడ్రోన్ పోప్ (25 బంతుల్లో 38; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) ఓ సిక్స్, రెండు ఫోర్లతో 14 పరుగులు రాబట్టాడు. ఈ దూకుడుతో జట్టు ఏడు ఓవర్లలో రెండు వికెట్లకు 56 పరుగులు సాధించింది. అనంతరం హెట్‌మైర్ (59 బంతుల్లో 60; 7 ఫోర్లు; 1 సిక్స్) జోరును కొనసాగించి వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించాడు. అయితే విండీస్ 147 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోవడంతో పాటు... 38వ ఓవర్‌లో రెండు వికెట్లు తీసి బంగ్లా బౌలర్లు కాస్త ఆందోళన కలిగించినా స్ప్రింజర్ తుదికంటా క్రీజులో నిలిచాడు. 49వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాది జట్టును ఫైనల్‌కు చేర్చాడు. సలేహ్ అహ్మద్‌కు మూడు, సైఫుద్దీన్, మెహదీ హసన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.