విండీస్, ఇంగ్లండ్ తొలి టెస్టు డ్రా
నార్త్ సౌండ్ (అంటిగ్వా అండ్ బార్బుడా): జాసన్ హోల్డర్ (149 బంతుల్లో 103 నాటౌట్; 15 ఫోర్లు) కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేయడంతో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టును వెస్టిండీస్ డ్రా చేసుకుంది. సర్ వివియన్ రిచర్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... 438 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 129.4 ఓవర్లలో 7 వికెట్లకు 350 పరుగులు చేసింది.
98/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆఖరి రోజు ఆట కొనసాగించిన కరీబియన్ జట్టు ఓ దశలో 189 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. అయితే ఇంగ్లిష్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న హోల్డర్ కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. రామ్‌దిన్ (57)తో కలిసి ఏడో వికెట్‌కు 105; రోచ్ (15 నాటౌట్)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 56 పరుగులు జోడించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన అండర్సన్.. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. రెండో టెస్టు ఈనెల 21 నుంచి సెయింట్ జార్జ్‌లో జరుగుతుంది.