సామాజిక కార్యకర్త, ట్రాఫిక్ రామస్వామిని పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. చెన్నై నగరం లో ఇష్టారాజ్యంగా వెలుస్తున్న ఫ్లెక్సీలు,
చెన్నై, సాక్షి ప్రతినిధి: సామాజిక కార్యకర్త, ట్రాఫిక్ రామస్వామిని పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. చెన్నై నగరం లో ఇష్టారాజ్యంగా వెలుస్తున్న ఫ్లెక్సీలు, హోర్డింగులపై ధైర్యంగా ప్రశ్నించే వ్యక్తి చేతులకు ఎట్టకేలకూ సంకెళ్లు వేశారు. నగరంలో విచ్చలవిడిగా వెలిసే ఫ్లెక్సీలు, బ్యానర్లు, భారీ కటౌట్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులను సామాజిక సేవా కార్యకర్త రామస్వామి ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ కారణంగా ట్రాఫిక్ అనేది ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై రామస్వామి పెట్టిన అనేక కేసులు మద్రాసు హైకోర్టులో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులను నిలదీసే ధైర్యంలేక సర్దుకుపోతున్న ప్రజలకు 70 ఏళ్ల ట్రాఫిక్ రామస్వామి అభిమాన పాత్రుడయ్యాడు. ఎన్నో ఏళ్లుగా రామస్వామి తనదైన శైలిలో పోరాడుతూనే ఉండగా, ప్రజాశ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న పోరాటాన్ని ఎవ్వరూ అడ్డుకునే సాహసం చేయలేక పోయారు.
జయ ఫ్లెక్సీలు చింపివేత
ట్రాఫిక్ రామస్వామి ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫ్లెక్సీలను తానే స్వయంగా చించివేశారు. ఆ తరువాత అన్నా ఫ్లైఓవర్, అన్నాసాలై దర్గా సమీపంలోని బ్యానర్లను చించారు. సచివాలయం సమీపంలో జయకు శుభాకాంక్షలు తెలుపుతూ అమర్చిన బ్యానర్లను తొలగించనుండగా పోలీసులు అడ్డుకుని పంపివేశారు. బుధవారం సాయంత్రం వేప్పేరి పరిసరాల్లోని రోడ్లలోని కట్‌అవుట్, బ్యానర్లను తొలగిస్తుండగా ఆ మార్గంలో కారులో వస్తున్న హోటల్ యజమాని వీరమణి పక్కకు తప్పుకోవాలని రామస్వామిని కోరారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో కోపగించుకున్న వీరమణి వేప్పేరీ పోలీసులకు రామస్వామిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు బుధవారం రాత్రి ట్రాఫిక్ రామస్వామి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల ధ్వంసం, చట్టవిరుద్ధంగా వ్యవహరించడం, హత్యా బెదిరింపులు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గురువారం రామస్వామిని ఎగ్మూరు కోర్టులో ప్రవేశపెట్టి పుళల్‌జైలుకు తరలించారు.