అలరించిన అష్టావధానం | Catering for astavadhanam | Sakshi
Sakshi News home page

అలరించిన అష్టావధానం

Published Tue, Feb 7 2017 3:14 AM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

Catering for astavadhanam

► ధారణశక్తిని ప్రదర్శించిన అవధాని డాక్టర్‌ మేడసాని మోహన్
► పెద్ద సంఖ్యలో హాజరైన తెలుగు సాహితీ ప్రియులు

కొరుక్కుపేట: పృచ్ఛకులు అడిగి న ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులు చెబుతూ అవధాన కళా తపస్వి డాక్టర్‌ మేడసాని మోహన్ నిర్వహించిన అష్టావధానం కార్యక్రమం అలరించింది.సర్‌ త్యాగరాయ కళాశాల తెలుగు శాఖలోని ఆంధ్ర విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో అష్టావధానం కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం జరిగింది. అవధానిగా తిరుమల తిరుపతి దేవస్థానం,  పురాణ సా హిత్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్  పాల్గొన్నారు. పృచ్ఛకులుగా డాక్టర్‌ కా సల నాగభూషణం(నిషిద్ధాక్షరి), ఆచార్య జీవీఎస్‌ కృష్ణమూర్తి(న్యస్తాక్షరి), డాక్టర్‌ పుల్లూరి ఉమ(సమస్య), డాక్టర్‌ ఎ.అంబృణీ(దత్తపది), డాక్టర్‌ కోదండలక్ష్మణ(ఆశువు), డాక్టర్‌ ఎం మునిరత్నం(పురాణ పఠనం), డాక్టర్‌ పి.సీతమ్మ (వర్ణన), ఆచార్య సీఎంకే రెడ్డి (అప్రస్తుత ప్రసంగం) పాల్గొన్నారు.

సర్‌ త్యాగరాయ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.రవిచంద్రబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్‌ మాడభూషి సంపత్‌కుమార్‌  పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలుగు భాషలో  అవధాన ప్రక్రియ ప్రత్యేకత కలిగిందన్నారు. అందులో అవధాని మేడసాని మోహన్  శతవధాన, సహస్రవధానాలతో అవధాన ప్రక్రియను మరింత ఎత్తుకు తీసుకుని పోయారని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో అవధానం చేసి 25వరకు బిరుదులు అందుకున్న ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించారని చెప్పారు. చెన్నైలో పలు సంఘాలు, వ్యక్తులు తెలుగువారికి చేస్తున్న సేవలు కొనియాడదగినవని పేర్కొన్నారు. అందులో త్యాగరాయ కళాశాల ప్రధానమైందని అన్నారు.

పిట్టి త్యాగరాయ శెట్టి చేసిన సేవలు హర్షణీయమన్నారు. నగరంలోని పలు కళాశాలల్లో తెలుగు శాఖలను తీసివేస్తున్నారన్నారు. ఈ తరుణంలో త్యాగరాయ కళాశాలలో తెలుగు శాఖకు కొత్త అధ్యాపకుడిని నియమించడం గర్వంగా ఉందన్నారు. ఇది తెలుగు శాఖ పురోభివృద్ధికి దోహదంగా నిలుస్తుందన్నారు. వచ్చిన వెంటనే తెలుగు అధ్యాపకుడు డాక్టర్‌ ఎం.మునిరత్నం అష్టావధాన కార్యక్రమంతో తెలుగు భాష వికాసానికి కృషి చేయడం ముదావహమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు తెలుగు భాష పరిరక్షణకు దోహదపడుతాయన్నారు. ఆ తర్వాత ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.రవిచంద్రబాబు మాట్లాడుతూ అష్టావధానం కార్యక్రమాన్ని గత ఏడాది నిర్వహించాలనుకున్నామని, అయితే ఎన్నికల కారణంగా జరిపించలేకపోయామని అన్నారు.

ఇలాంటి అష్టావధాన కార్యక్రమాలతో తెలుగు భాష వికసిస్తుందన్న భావనతో చేపట్టామని అన్నారు. ఇందులో మేడసాని పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న యాజమాన్యంతోపాటు తన వంతుగా సేవ చేస్తున్న మాడభూషి సంపత్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడులో తెలుగువారికి పెద్ద దిక్కుగా ఉన్న డాక్టర్‌ సీఎంకే రెడ్డి త్యాగరాయ కళాశాల అంటే అభిమానం చూపుతున్నారని ఆయన వివరించారు. అంతకు ముం దు త్యాగరాయ కళాశాల అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.మునిరత్నం అతిథులకు స్వాగతం పలికి అష్టావధానం విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ పిట్టి కుమారస్వామితోపాటు సు«ధాకర్‌రెడ్డి, రాజశేఖర్, తెలుగు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న అష్టావధానం
నిషిద్ధాక్షరిలో డాక్టర్‌ కాసల నాగభూషణం అడిగిన అక్షరంతో అవధాని మేడసాని మోహన్  అష్టావధానం ప్రారంభించారు. ఆ సమయంలో అప్రస్తుత ప్రసంగంలో సీఎంకేరెడ్డి కాకిని గురించి అడగగా తనదైన శైలిలో మేడసాని కాకి కూడా గొప్ప సందేశాన్ని ఇస్తుందని, కాకి నుంచి శరణాగతిని నేర్చుకోవచ్చునని చెప్పారు. పెద్దనోట్లు రద్దును గురించి చమత్కారంగా మాట్లాడి ఆహూతులను ఆకట్టుకున్నారు. డాక్టర్‌ కోదండలక్ష్మణ ఆశువులో మద్రాసులో తెలుగు విద్య గురించి అడగగా  తెలుగుభాష, విద్య సంబంధించి పద్యాన్ని పాడి మరీ వివరించారు అవధాని మేడసాని మోహన్ . ప్రతి పురుషుడి వెనుక స్త్రీ ఉంటుందన్న ప్రశ్నకు చమత్కరిస్తూ స్త్రీ అంటే శ్రీమతే కానక్కరలేదని తల్లి కావచ్చునని చెప్పారు. ఇలా పృచ్ఛకులు అడిగిన వాటికి అవధాని తనదైన ధారణశక్తితో మేడసాని మోహన్  పాఠకులను ఆకట్టుకునేల అష్టావధానం చేసి అబ్బుర పరిచారు. అవధాని మేడసాని అవధాన ధారణ శక్తిని పద్యరూపంలో  వర్ణించి డాక్టర్‌ కాసల నాగభూషణం అందరిని ఆకట్టుకున్నారు.

Advertisement
Advertisement