అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు | Catering for cultural events | Sakshi
Sakshi News home page

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

Published Mon, Jan 13 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

Catering for cultural events

 దాదర్, న్యూస్‌లైన్: సీబీడీ బేలాపూర్‌లోని ‘తెలుగు కళావేదిక’ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కైరళి హాలు ప్రాంగణంలో ‘దాశరథీ కరుణాపయోనిధి’ పేరుతో జరిగిన శ్రీరామదాసు కీర్తనల కార్యక్రమానికి కళావేదిక సభ్యులతోపాటు శివారు ప్రాంతాల్లోని సంగీత అభిమానులు భారీగా తరలివచ్చారు. హనుమత్సమేత సీతారామ లక్ష్మణులు, అలాగే శ్రీరామదాసు చిత్రపటాలను పూలమాలలతో అలంకరించారు. దీపప్రజ్వలన, పూజాది కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరంజీవి విశ్వక్ ఆలపించిన దాశరథీ శతక  పద్యాలతో కార్యక్రమం ఆరంభమయింది. కళావేదిక సభ్యుల బృందం ఆలపించిన ‘శ్రీరామ నవరత్న కీర్తనలు’ శ్రోతలను ఆకట్టుకున్నాయి. ప్రముఖ సంగీత విద్వాంసురాలు శారదా సుబ్రహ్మణ్యం అత్యద్భుతంగా ఆలపించిన శ్రీ రామదాసు కీర్తనలు వీనులవిందు చేశాయి. అలాగే రమాసాయి, దార్గా భార్గవి సోదరిద్వయం ‘ఇదిగో భద్రాద్రి-గౌతమి అదిగో చూడండి..’ కీర్తనకు అభినయించిన భరతనాట్యం కనువిందు చేసింది. సి.పద్మావతి వ్యాఖ్యానం, శారదా మురళి (వయొలిన్), అనంతరాం లోకనాథ్ (మృదంగం) వాద్య సహకారం అందించారు.
 
 డోంబివలిలో..
 ఈ సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం డోంబివలిలోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముగ్గుల పోటీలతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. చిన్నారులకు భోగిపళ్లు, ఫ్యాన్సీ డ్రెస్, ఆటపాటల వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘స్వరమాధురి’ సంస్థ  ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు పార్వతి త్యాగరాజ శాస్త్రీయ సంగీత కచేరి జరిగింది. శ్రీ ముత్తయ్య భాగవతార్ ‘వాతాపి గణపతిం భజే..’, ‘హిమగిరి తనయే హేమలతే..’ తదితర కీర్తనలతో వీనుల విందు చేశారు. అలాగే పద్మావతి శిష్యురాలు నందిత, రమ్య హారిక, వైదేహి ఆలపించిన ‘రంజని’ రాగమాలిక, తులసీదాస్ విరచిత ‘ఠుమక చలత రామచంద్ర’ భజనలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. స్వరమాధురి ఉపాధ్యక్షుడు పి.అశ్విన్ కుమార్ వ్యాఖ్యానం, నారాయణ నంబూద్రి (మృదంగం), సూరజ్ (వేణువు), రామచంద్ర శర్మ (మృదంగం) వాద్య సహకారం అందించారు. ఆంధ్ర కళాసమితి తమ వయోధిక సభ్యులను, కళాకారులను సత్కరించింది. అలాగే గత విద్యా సంవత్సరంలో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకూ బహుమతులు అందించింది.
 
 ఘనంగా ‘ఆంధ్రజ్యోతి’ వార్షికోత్సవం
 దాదర్, న్యూస్‌లైన్: ప్రజాహిత సేవలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో నగరంలోని తెలుగు ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్న ‘ఆంధ్రజ్యోతి సేవా మండలి’ ఎనిమిదో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. నవీముంబైలోని వాషిలో ఉన్న తెలుగు కళాసమితి ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడు సంజీవ్ నాయక్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆయనతోపాటు శాసనసభ్యులు సందీప్ నాయక్, కిరణ్ పవాస్కర్, నగర ప్రముఖులు సాగర్ నాయక్, హరీష్ సనాస్, మాదిరెడ్డి కొండారెడ్డి (వైఎస్సార్సీపీ నేత-మహారాష్ట్ర) తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మండలి అధ్యక్షుడు మానవ్ వెంకటేష్ అతిథులకు స్వాగతం పలికి తమ సంస్థ సేవల గురించి తెలిపారు.
 
 దీపప్రజ్వలన తర్వాత వేదికపై ఉన్న అతిథులను శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. కిరణ్ పవాస్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక మరాఠీ ప్రజలతో మమేకమై సఖ్యతతో మెలుగుతున్న తెలుగు ప్రజలందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని అన్నారు. మండలి తరఫున ఇతర సంఘాల సభ్యులందరినీ కలుపుకొని అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న మానవ్ వెంకటేష్, కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. సంజీవ్ నాయక్ తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ముంబై నగర నిర్మాణంలోనూ, అభివృద్ధిలోనూ తెలుగు వారి పాత్ర మరిచిపోలేనిదని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజల సౌకర్యం కోసం మరిన్ని రైళ్లను ఠాణే స్టేషన్‌లో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఆంధ్రజ్యోతి సేవామండలి సొంతభవన నిర్మాణం కోసం ఘన్‌సోని లేక ఖార్గర్ పట్టణ ంలో స్థలాన్ని మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడంతో సభ కరతాళ ధ్వనులతో మార్మోగింది
 అలరించిన ‘స్వరమాధురి’..
 
 మండలి వార్షికోత్సవాల సందర్భంగా ప్రముఖ కళాకారుడు చలపతి శెట్టి వ్యాఖ్యానాలతో స్వరమాధురి సాంస్కృతిక సంస్థ డెరైక్టర్, గాయని గిరిజా ద్విభాష్యం ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరి శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. ‘సంగీత, సాహిత్య రచన ఝరి.. స్వరమాధురి’ అన్న ప్రారంభగీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అలనాటి ఆణిముత్యాలతోబాటు నేటితరం మెచ్చే పాటలతో గాయకులు వీనులవిందు చేశారు. యువగాయకుడు చిరంజీవి ఆలపించిన అన్నమయ్య కీర్తన ‘అదివో-అల్లదివో.. శ్రీ హరివాసమూ’ ప్రతి ఒక్కరినీ అలరించింది. గిరిజ, భావన, శివప్రసాద్, పత్రి భరణి, ఎస్.వి.ఆర్.మూర్తి తదితరులు ఆర్.టి.రాజన్ బృందం వాద్య సహకారంతో పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ కళాకారుడు మాధవ్ మోఘే మిమిక్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరగా విందు భోజనాలతో మండలి వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి.
 

Advertisement
Advertisement