సాక్షి, చెన్నై: రాష్ర్టంలో డీఎంకే నేతృత్వంలో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమి, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఆవిర్భవించాయి. అన్నాడీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు ఒంటరి బాట పట్టాయి. ఎన్నికల్లో తమ సత్తాను చాటుకుని జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఉరకలు తీస్తున్న వేళ అందరి దృష్టి ఉద్ధండుల గెలుపు మీద పడింది. అన్ని పార్టీల్లోనూ వీఐపీ అభ్యర్థులుగా ఉన్న వాళ్లల్లో కొందరు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. మరి కొందరు ఆయా పార్టీలకు అధినేతలుగా వ్యవహరిస్తున్నారు.
డీఎంకే మాజీలు గట్టెక్కేనా?
డీఎంకే మాజీ మంత్రులు పలువురు ఈ సంగ్రామంలో గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఆ పార్టీ అధినేత కరుణానిధి మనవడిగా, కేంద్ర మాజీ మంత్రి దివంగత మురసోలి మారన్ వారసుడిగా రాజకీయ అరంగ్రేటం చేసిన దయానిధి మారన్ సెంట్రల్ చెన్నై నుంచి వరుసగా రెండు సార్లు పార్లమెంట్ మెట్లు ఎక్కారు. ఓ మారు కమ్యూనికేషన్ శాఖ, మరో మారు టెక్స్‌టైల్స్ శాఖ మంత్రిగా పనిచేశారు. మూడో సారి గెలుపు కోసం అదే స్థానం బరిలో చమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్పెక్ట్రమ్ రాజా మళ్లీ నీలగిరి రేసులో నిలబడ్డారు. సిట్టింగ్ స్థానాన్ని కైవశం చేసుకుంటానన్న ధీమా ఆయనలో ఉన్నా, వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఆయన్ను వెంటాడుతున్నాయి.
బొగ్గు గనుల కుంభకోణం ఎక్కడ కొంపముంచుతుందోనన్న భయంతో ఆ శాఖ మాజీ మంత్రి జగద్రక్షగన్ తన మకాంను అరక్కోణం నుంచి శ్రీ పెరంబదూరుకు మార్చేశారు. ఇక్కడ ఆర్థిక బలం, అంగ బలం కలిగిన అభ్యర్థులు ప్రత్యర్థులుగా లేని దృష్ట్యా, గెలుపు ధీమాలో జగద్రక్షగన్ ఉన్నారు. గత ఎన్నికల్లో శ్రీ పెరంబదూరు నుంచి చివరి రౌండ్లో గట్టెక్కిన డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు ఈ సారి తన దృష్టిని తంజావూరు మీద పెట్టారు. తన సొంత జిల్లాల్లో పాగా వేస్తానన్న ధీమా ఆయనలో ఉన్నప్పటికీ, డీఎంకే సిట్టింగ్ ఎంపీ, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ సహాయ మంత్రి ఎస్‌ఎస్ పళని మాణిక్యం, డీఎంకే బహిష్కృత నేత అళగిరి రూపంలో ఆయన్ను ఓటమి భయం వెంటాడుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో తన ఇలాకాను చక్కదిద్దుకున్న దృష్ట్యా, నామక్కల్ ఓటర్లు తనకు పట్టం కడతారన్న ధీమాతో సిట్టింగ్ ఎంపీ గాంధీ సెల్వన్ ఉన్నారు.
అధినేతల్ని అదృష్టం వరించేనా?
రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు అధినేతలుగా ఉన్న వాళ్లు సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంటన్నారు. వీరిలో ఎండీఎంకే నేత వైగో విరుదునగర్ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడినా, ఈ సారి గెలుపు ధీమా ఆయనలో పెరిగింది. డీఎంకే బహిష్కృత నేత అళగిరి అండ ఆయనకు దక్కడం ఇందుకు కారణం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ మరో మారు అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. నాగుర్ కోయిల్ లోక్‌సభ నుంచి గతంలో ఓ మారు గెలిచినా, ఆ తర్వాత పార్లమెంట్ మెట్లు ఆయన ఎక్కలేదు. ఈ సారి మోడీ ప్రభంజనం తనను గెలిపిస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు.
పుదియ తమిళగం పార్టీ అధినేత కృష్ణ స్వామి గతంలో ఒంటరిగా తెన్ కాశి బరిలో దిగినప్పుడే లక్షన్నర ఓట్లను దక్కించుకున్నారు. ఈ సారి డీఎంకేతో కలసి వెళుత్ను దృష్ట్యా, గెలుపు తనదేనన్న ధీమా ఆయనలో పెరిగింది.
పుదియ నిధికట్చి నేత, విద్యా సంస్థల అధిపతి ఏసీ షణ్ముగం వేలూరు లోక్‌సభ సీటు దక్కించుకున్నారు. తనకంటూ సొంత పార్టీ ఉన్నా, కమలం చిహ్నం మీద పోటీ చేయాల్సిన పరిస్థితి. మైనారిటీ ఓట్లు అత్యధికంగా ఉండే ఈ లోక్‌సభలో ఆర్థిక బలం పనిచేసేనా అన్నది వేచి చూడాలి. ఎస్‌ఆర్‌ఎం విద్యా సంస్థల అధినేత, ఇండియ జననాయగ కట్చి(ఐజేకే) అధ్యక్షుడు పచ్చ ముత్త పారివేందన్ పెరంబలూరు లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్నారు. కమలం చిహ్నం మీద తొలి సారిగా ఎన్నికల బరిలో నిలబడిన ఆయన్ను అదృష్టం వరించేనా అన్న ఉత్కంఠ నెలకొంది. వీసీకే అధినేత తిరుమావళవన్ మరోమారు అదృష్టం వరిస్తుందన్న ఆశతో సిట్టింగ్ స్థానం చిదంబరం బరిలో నిలబడ్డారు. కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి అధినేత ఈశ్వరన్ పొల్లాచ్చి స్థానాన్ని ఎంపిక చేసుకోవడం గమనార్హం.
ఒక్క చాన్స్: రాజ్య సభ సీటుతో కేంద్రంలో ఆరోగ్య మంత్రిగా చక్రం తిప్పిన పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు తనయుడు అన్భుమణి రాందాసు తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చారు. ధర్మపురి లోక్ సభ నుంచి పోటీ చేస్తున్న ఆయనకు ఒక్క గెలుపు దక్కేనా అన్న ఉత్కంఠ నెలకొంది. అలాగే, ఆ పార్టీ అధ్యక్షుడు జికే మణి కృష్ణగిరి నుంచి బరిలో దిగారు. ఆ పార్టీ నేతలు, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రులుగా పనిచేసిన ఆర్ వేలు అరక్కోణంలో, ఏకే మూర్తి ఆరణి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. ఒకే ఒక్కడు: అన్నాడీఎంకేలో జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన వీఐపీ అభ్యర్థిగా తంబి దురై ఒక్కరే ఉన్నారు. ఆ పార్టీ పార్లమెంటరీ నేతగా ఉన్న తంబిదురై తన సిట్టింగ్ స్థానం కరూర్ నుంచి మళ్లీ రేసులో నిలబడ్డారు. అయితే, గల్లిలో కన్నా, ఢిల్లీలో ఎక్కువ రోజులు ఉన్న దృష్ట్యా, ఓట్ల కోసం వెళ్లిన చోటంతా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అయితే, అమ్మ(అధినేత్రి జయలలిత) ఆశీస్సులతో మళ్లీ గెలవడం తథ్యమంటున్నారు.
కష్టాల్లో కాంగ్రెస్ వీఐపీలు: ద్రవిడ పార్టీల ఛీత్కారానికి గురైన కాంగ్రెస్ రాష్ట్రంలో చతికిలబడి ఉంది. తమకు సీట్లు వద్దుబాబోయ్ అంటూ సిట్టింగ్‌లు పరుగులు తీసినా, ప్రధాన నేతలు దాట వేసినా, బరిలో దిగాల్సిందేనని అధిష్టానం ఒత్తిడి తేవడంతో గత్యంతరం లేని పరిస్థితి. కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్ తిరుప్పూర్ నుంచి, మరో మాజీ మంత్రి మణి శంకర అయ్యర్ మైలాడుతురై నుంచి ధైర్యంగా పోటీకి సిద్ధ పడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఈ సారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. వారసుడు కార్తీ చిదంబరంను రంగంలోకి దించారు. శివగంగై నుంచి పోటీ చేస్తున్న కార్తీ ఓడిన పక్షంలో చిదంబరం ఓడినట్టే?
ఉద్ధండుల్లో ఉత్కంఠ!
Published Wed, Apr 16 2014 1:12 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement