నేటి నుంచి సమ్మె
Published Sat, Apr 5 2014 11:54 PM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM
సాక్షి, చెన్నై: విరుదునగర్ జిల్లాలోని శివకాశి బాణసంచా తయారీకి పెట్టింది పేరు. ఇక్కడి నుంచి ఒకప్పుడు దేశ వ్యాప్తంగా బాణసంచా సరఫరా అయ్యేది. పెద్ద పెద్ద పరిశ్రమలతో పాటుగా కుటీర పరిశ్రమల తరహాలో ఇళ్లలోనూ బాణసంచా తయారీ ఇక్కడ సాగుతుందేడి. ప్రతి ఏటా పెరుగుతున్న ప్రమాదాలతో అధికార యంత్రాంగం కొరడా ఝుళిపించింది. దీంతో కుటీర పరిశ్రమల సంఖ్య తగ్గింది. భారీ పరిశ్రమల్లో ఆధునిక యుగానికి తగ్గట్టుగా బాణసంచా తయారీ సాగుతోది. శివకాశి పరిసరాల్లోని వందలాది గ్రామాల్లోని ప్రజలు ఈ పరిశ్రమలను నమ్ముకుని జీవిస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంగా అధికారుల ఆంక్షల కొరడా యాజమాన్యాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి తగ్గడం, బాణసంచా తయారీ ముడి సరకుల ధర పెరగడం వెరసి యాజమాన్యాలను కన్నీటి మడుగులో ముంచుతున్నాయి. దీనికి తోడు గత కొంత కాలంగా చైనా నుంచి బాణసంచా భారీగా దిగుమతి అవుతుండడం యాజమాన్యాలను మరింత ఆవేదనకు గురి చేసింది. ప్రతి ఏటా కోట్లాది రూపాయలను పన్నుల రూపంలో తాము చెల్లిస్తుంటే, చైనా బాణసంచా మార్కెట్లో హల్‌చల్ సృష్టిస్తుండటాన్ని యాజమాన్యాలు తీవ్రంగా పరిగణించారుు. సముద్ర మార్గం గుండా తమిళనాడులోకి బాణసంచా చొరబడుతున్నట్టు, దక్షిణాది రాష్ట్రాల్లో చైనా బాణసంచా విక్రయాలు పెరుగుతున్నట్టు గుర్తించిన యూజమాన్యాలు ఆందోళనకు పూనుకున్నారుు.
ఆక్రోశం: తమ మీద ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్న అధికారులు, చైనా బాణా సంచా విక్రయాన్ని చూసీ చూడనట్టుగా ఉండటం ఏమిటని ఉత్పత్తిదారులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు, పాలకుల తీరును నిరసిస్తూ సమ్మె బాటకు సిద్ధం అయ్యారు. శనివారం శివకాశిలోని సుమారు 500 పరిశ్రమల యాజమాన్యాలు, లారీ ట్రాన్స్‌పోర్ట్ సంఘాలు సమావేశం అయ్యాయి. తమ మీద ఆంక్షల్ని ఝుళిపిస్తున్న ప్రభుత్వం, చైనా బాణసంచా మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నను లేవ దీశారుు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ , చైనా బాణసంచా అక్రమ రవాణా అడ్డుకట్ట లక్ష్యంగా సమ్మె బాట పట్టేందుకు నిర్ణయించారు. ఆదివారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు ప్రకటించారు.
యాజమాన్యాలు సమ్మె బాటకు నిర్ణయించడంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. సుమారు 2 లక్షల మంది కార్మికులు ఇక్కడి బాణసంచా పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పీస్ రేట్‌ల రూపంలో, రోజు వారీ, వారాంతపు వేతనాల రూపంలో పనిచేస్తున్న ఈ కార్మికుల్లో సమ్మె భయం వణికిస్తున్నది. ఉత్పత్తి ఆగిన పక్షంలో తాము కడపులు మాడ్చుకోవాల్సి ఉంటుందన్న ఆవేదనను కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి, తమ యాజమాన్యాల డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Advertisement
Advertisement