
రిజర్వేషన్ల కోసం హిజ్రాల పట్టు
♦ ప్రతి పార్టీ ఒక టికెట్ ఇవ్వాలని డిమాండ్
♦ చెన్నై ఆర్కేనగర్ నుంచి హిజ్రా పోటీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని హిజ్రాలు కోరుతున్నారు. ఇకపై ప్రతి ఎన్నికల్లో హిజ్రాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుత ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోని ప్రతి పార్టీ ఒక టికెట్‌ను హిజ్రాకు కేటాయించాలని డిమాండ్ చేశాయి. 12 స్వచ్ఛంధ సేవా సంస్థల ప్రతినిధులు డాక్టర్ శ్యామలా నాధూరాజ్, డాక్టర్ విజయరామన్, భక్తవత్సలం, జయ సహోదరన్, భావన, హరిహరన్ చెన్నై ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మతం, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు అనేక అవకాశాలు ఇవ్వడంలో తమిళనాడు ఎప్పుడూ ముందున్నదని అన్నారు.
అయితే హిజ్రాలపై మాత్రం వివక్షచూపుతున్నారని ఆరోపించారు. సమాజంలో మూడో రకం మనుషులుగా గుర్తింపుపొందిన తాము అన్నిరంగాల్లో అవకాశాలు, గుర్తింపు పొందుతుండగా రాజకీయపార్టీలు మాత్రం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో తాము స్థిరపడాలంటే ఆర్థిక, రాజకీయ బలం అవసరమని అన్నారు. రాజకీయంగా ముందడుగు వేస్తే ఆర్థిక బలం తానుగా సమకూరుతుందని చెప్పారు. అందుకే ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రతి పార్టీ కనీసం ఒక్క సీటైనా హిజ్రాలకు కేటాయించాలని కోరుతున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు తమ వినతిపత్రాన్ని, దరఖాస్తులను ప్రతిరాజకీయ పార్టీకి సమర్పించినట్లు వారు చెప్పారు.
అన్నాడీఎంకే నుంచి పోటీ చేసేందుకు సుధ, డీఎంకే నుంచి రగసియ, డీఎండీకే నుంచి రాధిక దరఖాస్తులు సమర్పించారని వారు తెలిపారు. చెన్నై ఆర్కేనగర్ నుంచి సేలం దేవి (హిజ్రా) నామ్‌తమిళర్ కట్చి అభ్యర్థిగాా ఖరారైనట్లు వారు తెలిపారు. నామ్ తమిళర్ కట్చి తీరులోనే ప్రతిపార్టీ ఒక స్థానంలో హిజ్రాలకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజలకు సేవలు చేసే విషయంలో తాము ఎవ్వరికీ తీసిపోమనివారు పేర్కొన్నారు. తమిళనాడును ప్రగతిపథంలో నడిపించడంలో తమను భాగస్వామ్యులను చేయాలని వారు అన్నారు. తమ డిమాండ్లను ఎన్నికల కమిషన్, రాజకీయపార్టీలు పరిశీలించాలని వారు కోరారు.