
డిప్యూటీ ఇస్తే ఓకే
డిప్యూటీ సీఎం పదవి తమకు ఇస్తే డీఎంకేతో దోస్తీకి సిద్ధమన్న సంకేతాలను డీఎండీకే పంపింది.
సాక్షి, చెన్నై : డిప్యూటీ సీఎం పదవి తమకు ఇస్తే డీఎంకేతో దోస్తీకి సిద్ధమన్న సంకేతాలను డీఎండీకే పంపింది. డీఎండీకే అధినేత విజయకాంత్ డీఎం కే దూతల వద్ద మౌనం వహిస్తుండటంతో ఆయ న సతీమణి ప్రేమలత రంగంలోకి దిగారు. డీ ఎంకేను చిక్కుల్లో పడే స్తూ తమకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పొత్తుకు ఓకే అన్న మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారం లక్ష్యంగా డీఎంకే కుస్తీ పడుతోంది. ప్రజల్ని ఆకర్షించే రీతిలో దూసుకెళుతోంది.
ఇప్పటికే ఆ పార్టీ దళపతి, కోశాధికారి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో మూడు విడుతలుగా నియోజకవర్గాల్లో పర్యటించారు. వినూత్న శైలిలో సాగుతున్న ఆయన పర్యటనకు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం అదేబాటలో మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, కరుణానిధి గారాల పట్టి కనిమొళి పర్యటనకు సిద్ధమయ్యారు. తమతో దోస్తీకి రాజకీయ పక్షాలు ముందుకు రాకపోవడం డీఎంకేకు మింగుడు పడటం లేదు.
తమకు వ్యతిరేకంగా ఎండీఎంకే పావులు కదిపి ప్రజా కూటమిని ఏర్పాటు చేసి ఉండటాన్ని తీవ్రంగా పరిగణించి ఉన్న డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆ కూటమిని చీల్చేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో కనీస ఓటు బ్యాంక్ కల్గిన డీఎండీకే నేత విజయకాంత్‌ను ఎలాగైనా సరే తమతో కలిసి అడుగులు వేయించేందుకు కుస్తీలు పడుతున్నారు.
దళపతి ఆదేశాల మేరకు విజయకాంత్‌తో సన్నిహితంగా మెలుగుతున్న పలువురు డీఎంకే వర్గాలు, మత పెద్దలు రంగంలోకి దిగి ఉన్నారు. విజయకాంత్‌తో ఇప్పటికే పలు దఫాలుగా దూతలు సంప్రదింపులు జరిపి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. మౌనం వహించిన విజయకాంత్ చివరకు అంతా ప్రేమలతే అంటూ తన సతీమణికి పొత్తు బాధ్యతను అప్పగించినట్టు సమాచారం.
రంగంలోకి దిగిన ప్రేమలత డీఎంకేను ఇరకాటంలో పెట్టే రీతిలో తన నిర్ణయాన్ని వెల్లడించినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. తమకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతోపాటు, తాము కోరిన సీట్లను తప్పనిసరిగా ఇచ్చేందుకు అంగీకరిస్తే దోస్తికి సిద్ధమని, మళ్లీమళ్లీ సంప్రదింపులు అనవసరమని తేల్చేసినట్లు తెలిసింది. డీఎంకే అధికారంలో వచ్చిన పక్షంలో సీఎంగా కరుణానిధి, డిప్యూటీ సీఎంగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టడం ఖాయం.
ఏకంగా స్టాలిన్ పదవికి ఎసరు పెట్టే విధంగా ప్రేమలత వ్యవహరించి ఉండటం బట్టి చూస్తే డీఎంకే వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ముం దుగా ప్రజా కూటమి చీలిక, తదుపరి విజయకాంత్‌ను బుట్టలో వేసుకోవడం వంటి నిర్ణయాలతో స్టాలిన్ ముందుకు సాగుతున్నారు. కరుణానిధిని సీఎం కుర్చీ లో కూర్చోబెట్టేందుకు స్టాలిన్ తంత్రాల్ని ప్రయోగిస్తున్నట్లు చర్చ సాగుతోంది.