సీఎస్‌గా మోహన్ వర్గీస్ | Mohan Varghese sungat has been appointed as the new Chief Secretary of the state | Sakshi
Sakshi News home page

సీఎస్‌గా మోహన్ వర్గీస్

Published Sun, Mar 30 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM

Mohan Varghese sungat has been appointed as the new Chief Secretary of the state

సాక్షి, చెన్నై : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మోహన్ వర్గీస్ సుంగత్ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ సోమవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆమెను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా దేబేంద్రనాథ్ సారంగిని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సారంగి తన వంతు కృషి చేశారు. గత ఏడాది జనవరిలో ఆయన పదవీ విరమణ పొందారు.
 
ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్‌గా 1976 బ్యాచ్‌కు చెందిన షీలా బాలకృష్ణన్ నియమితులయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత, సీఎస్‌లు మహిళలు కావడంతో ఇద్దరు కలసికట్టుగా కీలక నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నా యి. జయలలిత ఎక్కడకు వెళ్లినా, ఆమె వెన్నంటి షీలా బాలకృష్ణన్ ఉండే వారు. రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు లబ్ధిదారుల చెంతకు చేర్చడంలో షీలా బాలకృష్ణన్ తన వంతు కృషి చేశారు. అటు అధికారులతో, ఇటు మంత్రి వర్గంతోను సన్నిహితంగా ఉండి అందరి మన్నలు అందుకున్న షీలా బాలకృష్ణన్ సోమవారం పదవీ విరమణ పొందనున్నారు. దీంతో ఆమె స్థానంలో కొత్త సీఎస్ నియామకం అనివార్యం అయింది.
 
 సీఎస్‌గా మోహన్
రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న మోహన్ వర్గీస్ సుంగత్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు చర్యలు తీసుకున్నారు. పర్యావరణ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మోహన్ వర్గీస్ మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన 1978 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. సబ్ కలెక్టర్‌గా తమిళనాడులో విధుల్లోకి చేరిన ఆయన అంచలంచెలుగా ఎదిగి ప్రధాన కార్యదర్శి హోదాను తన వశం చేసుకున్నారు. ఈయన సతీమణి షీలా రాణి సుంగత్ కూడా ఐఏఎస్ అధికారి. హస్త కళలు, చేతి వృత్తి దారుల సంక్షేమ బోర్డుకు డెరైక్టర్‌గా ఈమె వ్యవహరిస్తున్నారు.
 
కొత్తగా సీఎస్ బాధ్యతలు చేపట్టనున్న మోహన్ వర్గీస్ అదనంగా ఏసీబీ, అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ బాధ్యతలను సైతం నిర్వర్తించనున్నారు. పదవీ విరమణ పొందనున్న షీలా బాలకృష్ణన్ సేవలను వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది దేబేంద్రనాథ్ సారంగి సేవల్ని వినియోగించుకోవడం ధ్యేయంగా కొత్తగా ప్రభుత్వ సలహాదారు పదవిని ఏర్పాటు చేశారు. ఆయన ఏడాది పాటు ఆ పదవిలో ఉండి ప్రభుత్వానికి సేవలు అందించారు. ఇక నుంచి ఆ పదవిలో షీలా బాలకృష్ణన్ రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు అందించనున్నారు. షీలా బాలకృష్ణన్, మోహన్ వర్గీస్‌లు రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలితను శనివారం కలుసుకున్నారు. పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇన్నాళ్లు సేవలు అందించిన షీలాను జయలలిత అభినందించారు. కొత్త సీఎస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement