అంధేరీలోని ఆర్టీఓ కార్యాలయం లోపలి భాగం
సాక్షి, ముంబై: అంధేరీలో ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) ప్రారంభమై ఏడాది గడిచినా ఇప్పటికీ అగ్నిమాపక నిరోధానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వాహనానికి సంబంధించిన పత్రాలు జాగ్రత్తగా ఉంటాయా? అనే సందేహం స్థానికుల్లో నెలకొంది. ఒకవేళ ఇక్కడ అనుకోకుండా అగ్నిప్రమాదం సంభవిస్తే ఇందులోని పత్రాలు కాలి బూడిదయ్యే ప్రమాదముంది. మంత్రాలయలో భారీ అగ్నిప్రమాదం ఘటన నుంచి ఆర్టీఓ అధికారులు గుణపాఠం నేర్చుకోకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యాలయం వైశాల్యం 75,000 చదరపు అడుగులపైనే. ఈ కార్యాలయానికి ప్రతిరోజూ అనేక పత్రాలు వస్తుంటాయి. అయినప్పటికీ ఇందులో స్మోక్ డిటెక్టర్లు (పొగ గుర్తింపు పరికరాలు) కూడా అందుబాటులో లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికితోడు‘ఫైర్ అలారమ్’ వ్యవస్థ కూడా సరిగా లేదు. ఈ కార్యాలయానికి ప్రతిరోజూ డ్రైవింగ్ లెసైన్సు పత్రాలకోసం దరఖాస్తులు వస్తుంటాయి.
పొరపాటున అగ్నిప్రమాదం సంభవిస్తే ఈ కాగితాలు మాడిమసైపోతాయంటూ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఈ విషయమై అంధేరీ ఆర్టీవో అధికారి పి.జి.భలేరావ్ స్పందిస్తూ.. తమ వద్ద స్ప్రింక్లర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే సరైన అలారం వ్యవస్థ లేదనే విషయాన్ని ఆయన అంగీకరించారు.