ఢిల్లీలో పళని వర్సెస్ పన్నీరు
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాలు మరోసారి ఢిల్లీకి చేరాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు (మంగళవారం) ఇరు వర్గాలు ఢిల్లీ పెద్దలను కలవనున్నారు.
అన్నా డీఎంకే ఎంపీల బృందంతో కలసి సీఎం పళనిస్వామి.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. పలువురు కేంద్రమంత్రులను కూడా పళనిస్వామి బృందం కలవనుంది. మాజీ సీఎం పన్నీరు సెల్వం కూడా తన మద్దతుదారులైన ఎంపీలతో కలసి ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పన్నీరు సెల్వం వర్గం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనుంది. ఈ మేరకు వారు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని పన్నీరు సెల్వం వర్గం కోరనుంది.
ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో సీఎం పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. స్పీకర్ అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరించారని, పళనిస్వామి బలపరీక్ష చెల్లదని ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, పన్నీరు సెల్వం, ఇతర పార్టీల నాయకులు ఆరోపించారు. స్టాలిన్ ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్‌కు ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీ సహా ఇతర నేతలను కలిశారు. తాజాగా పన్నీరు సెల్వం వర్గం ఇదే విషయంపై ఫిర్యాదు చేయనుంది. కాగా సీఎం పళనిస్వామి వర్గీయులు తమిళనాడుకు సంబంధించిన విషయాలపై చర్చించనున్నారు.