పోలింగ్ ప్రశాంతం
- 68 శాతం నమోదు..
- ఈవీఎంల లో 434 మంది అభ్యర్థుల భవితవ్యం
- మందకొడిగా ప్రారంభమైన పోలింగ్
- గ్రామాల్లో పోలింగ్ ముమ్మరం
- మండుటెండలోనూ బారులుతీరిన ఓటర్లు
- పలు గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ
- సొరబలో జేడీఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ
- బళ్లారిలో పాత్రికేయులపై పోలీసుల దాడి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. రాష్ర్ట వ్యాప్తంగా మొత్తం 4.62 కోట్ల మందికి గాను 68 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.. మొత్తం 434 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియగానే ఈవీఎంలను నిర్దేశిత స్ట్రాంగ్ రూములకు తరలించారు.
ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఊపందుకుంది. ఎప్పటిలాగే బెంగళూరులో పోలింగ్ కొద్ది అటు ఇటుగా యాభై శాతానికి పరిమితమైంది. నగరంలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలన్నీ బోసిపోయి కనిపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ముమ్మరంగా సాగింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
9 గంటలకే ముగిసిన పోలింగ్
చామరాజ నగర కొల్లేగాల సమీపంలోని నల్లికట్టి గ్రామంలో 110 ఓట్లున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. గంటలోగానే 90 మంది ఓట్లు వేసి వెళ్లిపోయారు. మరో గంటలో మిగిలిన 20 మంది ఓటు వేశారు.
అవే ఫిర్యాదులు : ఈవీఎంలలో లోపాలు, కనీస సదుపాయాల కల్పించ లేదని పోలింగ్ బహిష్కరణ, ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతు, మారిన పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సందర్భంగా వివిధ పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం, కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విపరీతమైన రద్దీ...లాంటి సంఘటనలు ఎప్పటిలాగే ఈ పోలింగ్‌లోనూ చోటు చేసుకున్నాయి.
రామనగర జిల్లాలో మంత్రి డీకే. శివకుమార్ మద్దతుదారులు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. శివమొగ్గ నియోజక వర్గంలోని సొరబలో జేడీఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గదగ జిల్లాలోని నరగుందలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఘర్షణకు దారి తీసేలా కనిపించడడంతో పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జి చేశారు. బళ్లారిలో పాత్రికేయులపై పోలీసులు దాడి చేసినట్లు రాజధానికి సమాచారం అందింది. ఇలాంటి స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్‌కు ఎలాంటి అంతాయం ఏర్పడలేదు.
ఓటర్ల ఆసక్తి : బెంగళూరు దక్షిణ నియోజక వర్గంలో తొలి సారిగా ‘ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్’ను నెలకొల్పారు. ఈ పద్ధతి కింద ఈవీఎంకు అనుసంధానంగా ప్రింటర్ లాంటి సాధనాన్ని నెలకొల్పారు. ఓటరు ఈవీఎం మీట నొక్కగానే రెండు సెకన్లలో తాము ఓటు వేసిన చిహ్నం పేపర్‌పై కనిపించి, అదే యంత్రంలో దిగువకు వెళ్లిపోతుంది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు దీనిని ఆసక్తిగా గమనించారు. అయితే దీని వల్ల పోలింగ్ ఆలస్యమవుతుందని కొందరు పోలింగ్ అధికారులు ఓటర్లను తొందర పెట్టడం కనిపించింది.