తలనీలాల వేలంలో లేడీ డాన్ చక్రం
తలనీలాల వేలంలో లేడీ డాన్ చక్రం
Published Fri, Oct 28 2016 4:30 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
భారీగా తగ్గిన తలనీలాల వేలం పాట
రూ.90 లక్షలు పలికిన తలనీలాల పాట
7 గంటల పాటు కొనసాగిన వేలం
గత ఏడాది కంటే రూ.30 లక్షలు తక్కువ
అయినా కట్టబెట్టిన అధికారులు
దేవస్థానం అధికారులకు లక్షల్లో ముడుపులు ?
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో భక్తులు సమర్పించిన తలనీలాలు పోగు చేసుకునేందుకు గురువారం దేవస్థానం అధికారులు వేలంపాట నిర్వహించారు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు చెందిన ముగ్గురు వేలంలో పాల్గొన్నారు. ఈ ఏడాది కె.వి.నర్సమ్మ అనే మహిళ రూ.1.30 కోట్లకు హక్కులు పొందినప్పటికీ, మూడు నెలల తరువాత తన వల్ల కాదంటూ చేతులేత్తేసింది. దీంతో తిరిగి వేలం పాట నిర్వహించాల్సి వచ్చింది. గురువారం మధ్యాహ్నం 11 గంటలకు ప్రారంభమైన వేలం పాట రాత్రి 6.30 గంటల వరకు కొనసాగింది. తలనీలాల వేలం పాట ఇంత సమయం సాగటం దేవస్థానం చరిత్రలో ఇదే తొలిసారి. అయితే ఇంతసేపు సాగదీసిన అధికారులు.. ఆలయానికి ఆదాయం తెచ్చిపెట్టారని భావిస్తే, పప్పులో కాలేసినట్లే. 2016 నవంబర్ 1 నుంచి 2017 అక్టోబర్ 31 వరకు తలనీలాలు పోగు చేసుకునేందుకు నిర్వహించిన వేలం పాటలో రూ.90.09 లక్షలకు ఫైనల్ చేశారు. గుంటూరు జిల్లా కొలకలూరుకు చెందిన ప్రసాదం చంధ్రశేఖర్ అనే వ్యక్తి పాట దక్కించుకున్నారు. అయితే ఇది గత ఏడాది కంటే ఏకంగా రూ.40 లక్షలకు తక్కువగా టెండర్ ఖరారు కావడం గమనార్హం. గతంలో ఎప్పుడూ ఇంత తక్కువకు కట్టబెట్టలేదు. అయితే లక్షల రూపాయలు చేతులు మారినందువల్లే ఇంత తక్కువగా వేలం పాడినప్పటికీ దేవస్థాన అధికారులు ఆమోదం తెలిపారనే ప్రచారం జరుగుతోంది.
ఎందుకీ వెసులుబాటు..
తలనీలాలు పోగు చేసుకునే వేలం పాటలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ నిబంధనలు ప్రకారం గత ఏడాది వచ్చిన ధర నుంచి పాటను ప్రారంభించాలి. అంటే 1.30 కోట్లు నుంచి పాట మొదలు పెట్టాలి. కానీ పాటదారులు రూ.50 లక్షల నుంచి పాట ప్రారంభించారు. తమకు నచ్చిన రీతిలో ఒక్కో వెయ్యి అదనంగా కలుపుతూ ఏడు గంటలకు పైగా కావాలనే సాగదీశారనే ప్రచారం సాగుతోంది. పాట సాగుతున్న మ«ధ్యలో సదరు ముగ్గురు వ్యక్తులు తరచూ చర్చించుకోవటం, ఎవరో బయట నుంచి గైడ్ చేస్తున్నట్లుగా సెల్‌ఫోన్ సంభాషణలో బిజీబిజీగా గడపడం కనిపించింది. వారికి నచ్చిన రీతిలో పాట పాడుకునే అవకాశం ఇవ్వటం, దేవస్థానం అధికారులు దీనిపై ఏమాత్రం శ్రద్ధ చూపకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా గతంలో వేలం దక్కించుకున్న కె.వి.నర్సమ్మ కూడా వేలం పాట ప్రాంగణం సమీపానికి వచ్చి, పాటలో కూర్చొన్న వారితో మంతనాలు చేయటం, ఇవన్నీ దేవస్థానం అధికారుల కళ్లెదుటే జరగడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
ఆలయ ఆదాయానికి భారీ గండి..
భద్రాద్రి రామాలయ ఆదాయానికి భారీ గండిపడింది. తలనీలాల వేలం పాటలో ఏకంగా రూ.40 లక్షలు తగ్గిపోయింది. ఒక పక్క హుండీల ఆదాయం కూడా క్రమేపీ తగ్గుతోంది. వచ్చే ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువవుతున్నాయి. దీన్ని పూడ్చుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉన్న తలనీలాల వేలం పాటల ద్వారానైనా ఆదాయం రాబట్టుకునేందుకు ప్రయత్నించాల్సిన అధికారులు.. ఈ విషయంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం వివిధ దుకాణాలకు, ఆలయ ప్రాంగణంలో ఒత్తులు, ఇతర పాటలు కూడా ఉన్నాయి. కోట్లల్లో పలికే తలనీలాల పాట తగ్గినందున, శుక్రవారం జరిగే వేలం పాటల్లోనూ ఆదాయానికి గండిపడే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కమిషనర్ ఆమోదిస్తేనే : రమేష్‌బాబు, ఈఓ
గతంలో నాలుగు సార్లు వేలం నిర్వహించినా, పాటదారులు ముందుకు రాలేదు. అందుకనే ఐదోసారి రూ.90 లక్షల వరకు వచ్చేలా చేశాము. పాటదారులు రూ.60 లక్షల వద్ద రింగ్ అయ్యేందుకు ప్రయత్నించారు. కానీ మేము ఒప్పుకోలేదు. గతంలో కంటే పాట ధర తగ్గినట్లు కానే కాదు. వెంట్రుకలకు మార్కెట్‌లో ధర తగ్గినందున ఈ పాట బాగానే వచ్చినట్లు భావించాలి. దీనిపై కమిషనర్‌కు నివేదిక పంపిస్తాము. అక్కడ ఆమోదం పొందితేనే లైసెన్సు హక్కులు ఇస్తాము. లేకుంటే మరోసారి వేలం నిర్వహిస్తాము.
Advertisement