రజనీ రాజకీయ ప్రవేశంపై ట్విట్టర్ వార్!
చెన్నై: ట్విట్టర్‌లో కుష్బు, తమిళి సై మధ్య మాటల తూటాలు పేలాయి. పరస్పరం విమర్శలతో ఎవరికి వారే అన్నట్టుగా ఇద్దరూ చాటింగ్‌తో రచ్చకెక్కారు. గురువారం ఇద్దరు మహిళా నేతల మధ్య ఏకంగా కొంతసేపు ట్విట్టర్‌లో వ్యాఖ్యల తూటాలు పేలడం చర్చకు దారి తీసింది. ఆ ఇద్దరిలో ఒకరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బు, మరొకరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై.
ట్విట్టర్ వార్ : రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చర్చ ఈ ఇద్దరు మహిళా నేతల మధ్య ట్విట్టర్‌వార్ నడిచింది. రజనీకాంత్ బీజేపీ వైపుగా రావాలని తమిళి సై చేసిన ట్విట్‌లో కుష్బు వ్యంగ్యాస్త్రంతో కూడిన కామెంట్ చేయడంతో వివాదానికి దారి తీసింది. ఇలా, బ్రతిమలాడి పార్టీలోకి ఆహ్వానించడం కాదు అని, సిద్ధాంతాలకు ఆకర్షితులై రావాలని సూచిస్తూ, ఈ ట్విట్ భిక్షాటనతో సమానం అన్నట్టుగా కుష్బు స్పందించడం తమిళిసైకు ఆగ్రహం కలిగించింది.
ఇందుకు ఆమె సమాధానమిస్తూ, ప్రస్తుతం తమరికి ఎదురవుతున్న సమస్యలు నాకు తెలుసు అని, సిద్ధాంతాల ఆకర్షణ అంటే, వేరే పార్టీలో చేరడమా, లేదా జంప్ జిలానీనా అని ప్రశ్నించారు. ఇందుకు కుష్బు సమాధానమిస్తూ, తమరి మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందా తనకు తెలియదంటూ, తనకు నచ్చిన పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యలు చేశారు. తనను ఎవ్వరూ కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించలేదు, దూతల్ని పంపించలేదంటూ వ్యంగ్యాస్త్రం సందించారు. దీంతో తమిళి సై మరింత దూకుడు పెంచి, డీఎంకే నుంచి తమరిని గెంటేశారుగా అని ట్విట్ చేయడం కుష్బులో మరింత ఆగ్రహం రేపింది. తమరు తనకు పీఆర్వోనా, అసిస్టెంటా? అని ప్రశ్నిస్తే ఏ కారణంతో తాను డీఎంకే నుంచి బయటకు వచ్చానో తెలుసా?, తన గురించి తమరికి ఏమి తెలుసు పెద్దరికంతో వ్యవహరిస్తే బాగుంటుందని, తమరేమైనా మానసిక వైద్యులా అని ప్రశ్నిస్తూ.. తమిళి సైకు కుష్బు చురకలు అంటించారు. ఇందుకు తమిళి సై ట్విట్ చేస్తూ, తాను డాక్టర్నే, ఇతరుల మెదడు స్కాన్ చేసే సత్తా ఉందని సమాధానం ఇచ్చారు.
చురకలు అంటించిన సామన్యుడు..
సెకండ్ గ్యాప్‌లో ఈ ట్వీట్ వార్‌ను ఆసక్తిగా పరిశీలిస్తూ వచ్చిన ఓ వ్యక్తి ట్వీట్‌తో ఆ ఇద్దరికి చురకలు అంటించే కామెంట్ పెట్టడం గమనార్హం. 2014లో కుష్బు డీఎంకే నుంచి బయటకు వచ్చారని, అప్పుడు ఆమెను తమ వైపు రావాలని బీజేపీ తరఫున తమిళి సై కూడా ఆహ్వానించిన్నట్టుందేనని కామెంట్ చేశాడు. అప్పుడు ఇలా వార్ సాగ లేదే అని చురకలు అంటించడంతో, సీనియర్ నేతగా, మహిళా నాయకురాలిగా ఉన్న తమిళి సైకు తాను గౌరవం ఇస్తున్నట్టు ట్విట్టర్‌ను కుష్బు సైన్ అవుట్ చేశారు. ఇక, ఈ యుద్ధం కాస్త మీడియాలోకి ఎక్కడంతో వేదికల మీదే కాదు, ట్విట్టర్‌లోనూ తాము ఏ మాత్రం తగ్గమని ఇద్దరు మహిళా నేతలు నిరూపించుకోవడం గమనార్హం.