డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాజకీయ వారసత్వం కోసం స్టాలిన్, అళగిరి మధ్య వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల పార్టీ నుంచి అళగిరి బహిష్కరణకు గురయ్యూరు.
మరో కొత్త పార్టీ?
Published Mon, Mar 10 2014 11:53 PM | Last Updated on Fri, Sep 28 2018 7:30 PM
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాజకీయ వారసత్వం కోసం స్టాలిన్, అళగిరి మధ్య వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల పార్టీ నుంచి అళగిరి బహిష్కరణకు గురయ్యూరు. ఆయన మద్దతుదారుల్లో పలువురు అళగిరి వెంట నడిచారు. మరి కొందరు స్టాలిన్‌కు మద్దతు ప్రకటించారు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక అళగిరి రోజుకో వ్యాఖ్యతో వార్తల్లో వ్యక్తిగా అవతరించారు. పార్టీతోపాటు నాయకులపై విమర్శనాస్త్రాలు ఎక్కు బెడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల సీట్లను అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలు సంధించారు. అయితే, ఆయన వ్యాఖ్యల్ని డీఎంకే అధిష్టానం పట్టించుకునే పరిస్థితిలో లేదు. తన మద్దతుదారులను స్వయంగా వెళ్లి కలుస్తూ వస్తున్న అళగిరి, డీఎంకేలో ఒకప్పుడు సేవలు అందించి, ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్న వాళ్లను కలుపుకు వెళ్లే యత్నంలో ఉన్నారు.
మద్దతుదారులు అనారోగ్యంతో ఆస్పత్రుల్లో ఉన్నా, ఏదేని వేడుకలకు ఆహ్వానించినా హాజరవుతూ, వారికి తానున్నానన్న భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు అళగిరి డీఎంకేను చీల్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.చీలిక: డీఎంకేలో చీలిక దిశగా అళగిరి ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పవచ్చు. పార్టీలో స్టాలిన్ వర్గం తిరస్కరించిన వారిని ఏకం చేయడం లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టు ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. అందుకే రాష్ట్రంలో ఆయన పర్యటన చాప కింద నీరులా సాగుతోందంటున్నారు. అదే సమయంలో తన మద్దతుదారులుగా ఉన్న రితీష్, నెపోలియన్, పళిని మాణిక్యం, ఆది శంకర్, జయ దురై, ెహ లన్ డేవిడ్ సన్‌లకు మళ్లీ సీటు ఇవ్వకుండా స్టాలిన్ అడ్డుపడ్డారన్న సమాచారంతో అళగిరి మరింత ఆక్రోశంతో ఉన్నారు.
పార్టీకి సేవలు అందించిన వారందరినీ పక్కన పెట్టిన దృష్ట్యా, వారిని కలుపుకుని తన సత్తా చాటుకునేందుకు అళగిరి సిద్ధం అవుతున్నారు. కొత్త పార్టీ: లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే భవిష్యత్తు తేలడం ఖాయం అన్న ధీమాతో అళగిరి ఉన్నారు. డిపాజిట్లు గల్లంతైన పక్షంలో తన సత్తాను చాటుకుంటూ తెరపైకి కొత్త పార్టీని తెచ్చే వ్యూహంతో అళగిరి ఉన్నాట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీలో నెలకొన్న పరిస్థితుల్లో ఎలాగో రానున్న ఎన్నికల్లో డీఎంకేకు పతనం తప్పదంటూ పదే పదే చెప్పుకొచ్చిన అళగిరి, ఆ ఎన్నికల అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందుకు బలం చేకూరే రీతిలో సోమవారం అళగిరి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
రెండు నెలల్లో: ఒకప్పుడు డీఎంకేకు సేవలు అందించి, తాజాగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు పంబళ్ నల్ల తంబిని ఉదయం అళగిరి పరామర్శించారు. 25 వాహనాలతో కాన్వాయ్ రూపంలో కాంచీపురం జిల్లా పరిధిలోని పల్లావరం వైపుగా అళగిరి దూసుకెళ్లారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ అక్కడి డీఎంకే నాయకుడు కరుణాకరన్ నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరిగినా పట్టించుకోలేదు. నేరుగా నల్ల తంబి ఇంటికి వెళ్లిన అళగిరి గంట పాటుగా అక్కడున్నారు. అనంతరం వెలుపలకు వచ్చిన అళగిరిని మీడియా కదిలించగా, డీఎంకేపై ఆక్రోశాన్ని వెల్లగక్కారు. కొత్త పార్టీ పెట్టే వ్యూహంలో ఉన్నట్టుందే..? అని మీడియా ప్రశ్నించగా లేదు అని సమాధానం ఇచ్చారు. తమరి మద్దతుదారులు కొత్త పార్టీ పెట్టాలని ఆశిస్తున్నట్టుందే..? అని ప్రశ్నించగా, వారందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని సమాధానం ఇచ్చారు. మద్దతుదారుల అభీష్టం మేరకు తన నిర్ణయాలు ఉంటాయని, రెండు నెలల్లో కొత్త పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తానని అళగిరి స్పష్టం చేయడం విశేషం.
Advertisement
Advertisement