వాట్సాప్కు గట్టి పోటీ: హైక్ ఆ ఫీచర్ తెచ్చేసింది
వాట్సాప్కు గట్టి పోటీ: హైక్ ఆ ఫీచర్ తెచ్చేసింది
Published Tue, Jun 20 2017 6:37 PM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM
న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను అధిగమించడానికి దేశీయ మెసేజింగ్ యాప్ హైక్ ఓ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ ను యాడ్ చేయకముందే, హైక్ తన ప్లాట్ ఫామ్ పై ఈ పేమెంట్స్ ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ తో 100 మిలియన్ కు పైగా ఉన్న తమ యూజర్లు, హైక్ ద్వారానే నగదు ట్రాన్స్ ఫర్స్, మొబైల్ బిల్స్ చెల్లించడం, రీఛార్జ్ చేసుకోవడం వంటి చేయవచ్చని కంపెనీ తెలిపింది. యూపీఐ ద్వారా ఉచితంగా, వెనువెంటనే బ్యాంకు నుంచి బ్యాంకుకు ట్రాన్స్ ఫర్లు, ఎలాంటి బ్యాంకు అకౌంట్లు లేకుండా వాలెట్ నుంచి వాలెట్ కు తక్షణ నగదు ట్రాన్స్ ఫర్ వంటివి చేసుకోవచ్చని హైక్ మెసెంజర్ వ్యవస్థాపకుడు, సీఈవో కవిన్ భారతి మిట్టల్ చెప్పారు. యాప్ నుంచి రీఛార్జ్ కూడా చేసుకోవచ్చని తెలిపారు.
గత ఆరు నెలలుగా తమ యూజర్లకు కొత్త అనుభవాన్ని అందించడం కోసం ఎంతో తాపత్రయపడ్డామని పేర్కొన్నారు.. భారత్ లో మెసేజింగ్ ప్లాట్ ఫామ్ పై పేమెంట్ సౌకర్యాన్ని తీసుకొచ్చిన తొలి యాప్ తమదేనని సంతోషం వ్యక్తంచేశారు. యూజర్ ఇంటర్ ఫేస్ ను మెరుగుపరిచామని, అదేవిధంగా యాప్ కెమెరాకు కొత్త ఫీచర్లను యాడ్ చేసినట్టు మిట్టల్ తెలిపారు. హైక్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వాట్సాప్ డిజిటల్ పేమెంట్ సర్వీసులు అందజేయడం కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ గతేడాది తీసుకున్న హఠాత్తు నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పలు పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మెసేజింగ్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ యాప్స్ కూడా పేమెంట్ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నాయి.
Advertisement
Advertisement