పార్టీ ఫిరాయింపుల అంశంపై మంగళవారం తెలంగాణ శాసనసభ దద్దరిల్లింది. దాంతో అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగింది.
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల అంశంపై మంగళవారం తెలంగాణ శాసనసభ దద్దరిల్లింది. దాంతో అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగింది. సభలో ప్రశ్నోత్తరాలు పూర్తి కాకుండానే సభ రెండు సార్లు పదినిమిషాల పాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభప్రారంభమైన తర్వాత బడ్జెట్ పద్దులపై చర్చను చేపట్టాలని స్పీకర్ మధుసూదనాచారి ఆదేశించారు. కాంగ్రెస్ సభ్యులు మాత్రం పార్టీ ఫిరాయింపుల అంశంపై చర్చను చేపట్టాలని ఆందోళనకు దిగారు.
ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షనేత జానారెడ్డి అన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ సభ్యులు పట్టించుకోలేదు. మరోవైపు ప్రభుత్వానికి అర్హత ఉందా? లేదా? అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అయినా కాంగ్రెస్ సభ్యులు పట్టు వీడక పోవడంతో సభ రెండో సారి 10 నిమిషాలపాటు వాయిదా పడింది.
వాయిదా అనంతరం విపక్ష సభ్యులు తమ పట్టువీడకపోవటంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేయాలని హరీశ్‌రావు ప్రతిపాదించగా స్పీకర్ ఆమోదించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి మినహా 14మంది కాంగ్రెస్ సభ్యులపై ఒకరోజుపాటు సస్పెన్షన్ వేటు పడింది. అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ పద్దులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.