- ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో రెచ్చిపోయిన దొంగలు
అమీర్‌పేట్: సంజీవరెడ్డినగర్ ఠాణా పరిధిలో చైన్‌స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. గంట వ్యవధిలో నలుగురు మహిళల మెడలో నుంచి సుమారు 30 తులాల బంగారు ఆభరణాలను లాక్కొని పారిపోయారు. సినీనటి శ్రీలక్ష్మి స్నాచింగ్ సంఘటన మరిచిపోకముందే దొంగలు ఎస్సార్‌నగర్ పరిధిలో వరుసగా నాలుగు స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం...
మధ్యాహ్నం 12 గంటలు: మధురానగర్‌కు చెందిన వెంకాయమ్మ ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలో ఉన్న 6 తులాల గొలుసుకు తెంచుకుని పారిపోయారు.
మధ్యాహ్నం 12.15: అమీర్‌పేట ధరమ్‌కరమ్ రోడ్డులో ఉండే విజయలక్ష్మి స్థానికంగా ఉన్న తమ సూపర్ మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా... వెనుక నుంచి వచ్చిన దొంగలు ఆమె మెడలోని 15 తులాల గొలుసు తెంచుకెళ్లారు.
మధ్యాహ్నం 12.30: బల్కంపేట బీకేగూడకు చెందిన శ్యామల (70) తమ ఇంటి ముందు నిలిచి ఉండగా ఆమె మెడలో ఉన్న 6 తులాల గొలుసును తెంపుకెళ్లారు.
మధ్యాహ్నం 12.40: వరంగల్‌కు చెందిన రజని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బంధువును చూసేందుకు వచ్చింది. రోడ్డుపై నడుకుంటూ వెళ్తుండగా దుండగులు ఆమె మెడలోని 2.5 తులాల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు.
ఇదీ దొంగల రూట్...
ముందుగా మధురానగర్‌లో స్నాచింగ్‌కు పాల్పడ్డ దొంగలు.. అక్కడ రోడ్డు క్రాస్‌చేసి అమీర్‌పేటకు వచ్చారు. ధరమ్‌కరమ్ రోడ్డులో మరో స్నాచింగ్‌కు పాల్పడి.. బీకేగూడ మీదుగా వచ్చి వృద్ధురాలి గొలుసును తెంచుకెళ్లారు. అక్కడ చివరగా ఈఎస్‌ఐ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో మరో మహిళ మెడలోని చైన్‌ను లాక్కుని జాతీయ రహదారి వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయా మార్గాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను తెప్పించుకొని పరిశీలిస్తున్నారు.