మెదక్ జిల్లా పటాన్ చెరువు మండలం చిత్కుల్ లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది.
హైదరాబాద్: మెదక్ జిల్లా పటాన్ చెరువు మండలం చిత్కుల్ లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం మెదక్ జిల్లా పటాన్‌చెరువు మండలంలోని చిట్కూల్ గ్రామంలో జరిగింది. వివరాలు..గ్రామానికి చెందిన తళారి బాబూరావు వెల్డర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య మాధవి, ముగ్గులు పిల్లలు మనోజ్(14), కవలపిల్లలు శ్రీరామ్(9), లక్ష్మణ్(9) లున్నారు. అయితే, గురువారం వారి ఇంటిలోని సిలిండర్ లీకై, గ్యాస్ పూర్తిగా వ్యాపించింది. ఇది తెలియని మాధవి వంట చేసేందుకు ప్రయత్నించగా సిలిండర్పేలిపోయింది.
దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. గాయపడిన వారిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుడుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.