
కాసుల కోసం కానిస్టేబుల్ వీరంగం
మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్ పనితీరు వివాదాస్పదంగా మారింది...
- ట్రాక్టర్ డ్రైవర్‌పై కానిస్టేబుల్ దాష్టికం
- రూ.10 వేల కోసం నడిరోడ్డుపై దాడి
- కొత్త కమిషనర్‌ను ఆశ్రయించనున్న బాధితులు
వరంగల్ క్రైం : మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్ పనితీరు వివాదాస్పదంగా మారింది. చేసేది ఖాకీ ఉద్యోగమే అయినా.. గుడుంబా డాన్‌గా అతడికి పేరుంది. అక్రమ కార్యకలాపాలను అరికట్టాల్సిందిపోయి.. ఇవి జరిగిన చోటుకు వెళ్లి డబ్బుల కోసం డిమాండ్ చే స్తుండడం ఆయనకు రివాజుగా మారింది. గురువారం ఓ ట్రాక్టర్ ్రైడె వర్‌ను ఇలాగే డబ్బుల కోసం బెదిరించి దాడి చేసిన ఘటన ఆ ప్రాంతంలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రతిరోజు మాదిరిగానే మిల్స్‌కాలనీ కానిస్టేబుల్ అలియాస్ గుడుంబా డాన్ గురువారం గుడుంబా తీసుకుని ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. గవిచర్ల, తీగరాజుపల్లిలో గుడుంబా తీసుకుని కరీమాబాద్, రంగశాయిపేట, శంభునిపేట జంక్షన్ ప్రాంతాలకు చేరుకున్నాడు.
మధ్యాహ్నం ఆర్‌టీఏ కార్యాలయం సమీపంలోని శ్రీసాయినగర్ కాలనీ మీదుగా వెళుతుండగా అత డికి ఒక ఇసుక ట్రాక్టర్ తారాసపడింది. తన దగ్గర ఉన్న సరుకును గమ్యానికి చేరవేశాడు. వెంటనే ట్రాక్టర్ వద్ద ప్రత్యక్షమయ్యాడు. కానిస్టేబుల్ తన కోసమే వస్తున్నాడని గ్రహించిన ట్రాక్టర్ డ్రైవర్ కొండేటి భాస్కర్ ట్రాక్టర్‌ను స్టార్ట్ చేసి వేగంగా కదిలించేందుకు యత్నించాడు. ఇంతలోనే కానిస్టేబుల్ ట్రాక్టర్‌పైకి ఎక్కి డ్రైవర్ భాస్కర్‌ను గల్లా పట్టుకుని కిందకు దించాడు. తప్పించుకుపోదామనుకుంటున్నావురా.. అని బూతులు తిట్టాడు. డ్రైవర్ భయానికి లోను కావడంతో రూ.10 వేలు ఇస్తేనే ట్రాక్టర్‌ను వదిలిపెడతానని, లేదంటే తాటా తీస్తానని బెదిరించాడు.
తన వద్ద డబ్బులు లేవని తాను కేవలం డ్రైవర్‌ను మాత్రమేనని భాస్కర్ చెప్పాడు. దీంతో నాకు ఎదురుచెబుతావురా అంటూ భాస్కర్‌ను ట్రాక్టర్ పైనుంచి కిందకు దించాడు. నడి రోడ్డుపై విచక్షణరహితంగా చితకబాదాడు. కానిస్టేబుల్ ముష్టిఘాతాలకు తాళలేక అతడు రోడ్డుపై పరుగులు తీశాడు. కానిస్టేబుల్ ఊరుకోకుండా డ్రైవర్ వెంటపడిమరీ తీవ్రంగా కొట్టాడు. రోడ్డుపై వెళ్తున్నవారు చూస్తున్నప్పటికీ కానిస్టేబుల్‌ను గుర్తుపట్టి తమకెందులే అని పక్కకు తప్పుకున్నారు.
ఈ క్రమంలో ట్రాక్టర్ యజమాని అక్కడికి చేరుకున్నాడు. డ్రైవర్‌ను వదిలేయాలని కానిస్టేబుల్‌ను బతిమాలాడాడు. కానిస్టేబుల్ ఇదేమీ వినకుండా ట్రాక్టర్ యజమానిపైనా దాడికి దిగాడు. కానిస్టేబుల్ అలిసిపోయి వదిలేసిన తర్వాత ట్రాక్టర్ డ్రైవర్, యజమాని వెళ్లి జరిగిన విషయాన్ని తమ వర్ధన్నపేట గ్రామస్తులకు తెలిపారు. వారి సలహాతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వరంగల్‌లో జరిగిన ఈ సంఘటనపై అక్కడి పోలీస్‌స్టేషన్‌లోనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సలహా ఇచ్చారు. దాడి ఘటనపై శుక్రవారం ఉదయం పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబును కలుస్తామని బాధితులు తెలిపారు.