
హామీల అమలుకు జేఏసీ అవసరం
తెలంగాణ ఉద్యమ క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం జేఏసీ కొనసాగాల్సిన
చైర్మన్ కోదండరాం స్పష్టీకరణ
రాష్ట్ర ఏర్పాటుతోనే బాధ్యత తీరిపోలేదని వ్యాఖ్య
గద్వాల: తెలంగాణ ఉద్యమ క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం జేఏసీ కొనసాగాల్సిన అవసరం ఉందని చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు జేఏసీ ఉంటుందని స్పష్టం చేశారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జేఏసీ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, సంప్రదింపులు జరిపితేనే ఏదైనా సమస్యకు పరిష్కారం లభిస్తుందని కోదండరాం అభిప్రాయపడ్డారు. జేఏసీలో అభిప్రాయ భేదాలు తలెత్తాయా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అలాంటివేవీ లేవని కొట్టిపడేశారు. రాష్ట్ర ఏర్పాటుతోనే బాధ్యత తీరిపోదని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాల్సి ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. తెలంగాణ ప్రాంత వనరులు అందరికీ దక్కే విధంగా కృషి చేస్తామని కోదండరాం చెప్పారు.
19 నుంచి కరువుపై అధ్యయనం
తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న కరువుపై జేఏసీ అధ్యయనం చేస్తుందని కోదండరాం తెలిపారు. ఈ నెల 19, 20 తేదీల్లో కరీంనగర్ జిల్లా జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో, ఆ తర్వాత నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌పై తమవంతు సూచనలు కూడా అందిస్తామన్నారు.